‘ఆ జ్యువెలరీ చేయించిన తర్వాతే నా మీద ఆరోపణలు’.. రోల్డ్ గోల్డ్‌పై పాత బస్తీ సూర్యా భాయ్ క్లారిటీ
‘ఆ జ్యువెలరీ చేయించిన తర్వాతే నా మీద ఆరోపణలు’.. రోల్డ్ గోల్డ్‌పై పాత బస్తీ సూర్యా భాయ్ క్లారిటీ
తాను ధరించే కేజీల కొద్దీ బంగారు నగలు నకిలీవని ఐటీ అధికారులు తేల్చడం, సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడంపై హైదరాబాద్ పాతబస్తీ గోల్డ్‌మ్యాన్ సూర్యా భాయ్ స్పందించారు. తాను కష్టపడి పైకి వచ్చానని, ఎవరినీ మోసం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తాను చేయించుకున్న కొత్త నగలను చూసి ఈర్ష్యతోనే కొందరు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎటువంటి క్రైమ్ చేయలేదని, కేవలం తనను డీఫేం చేయడానికి కావాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఫైరయ్యారు.
హైలైట్:
రోల్డ్ గోల్డ్ వివాదం
క్లారిటీ ఇచ్చిన పాతబస్తీ సూర్యా భాయ్
ఈర్ష్యతోనే దుష్ప్రచారం అంటూ ఫైర్
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన సూర్యా భాయ్ అలియాస్ పల్లపు సురేష్ కుమార్ గోల్డ్‌మ్యాన్‌గా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఇటీవల తిరుమల శ్రీవారిని సూర్యా భాయ్ దర్శించుకోగా.. ఒంటిపై కేజీల కొద్దీ బంగారం ఉండటంతో భక్తులు ఆయనతో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. అయితే అతడి అసలు రంగును ఐటీ అధికారులు తాజాగా బట్టబయలు చేశారు. ఒంటి నిండా కేజీలకొద్దీ బంగారంతో మెరిసిపోతూ, సోషల్ మీడియా, యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో అత్యంత ధనవంతుడిగా చలామణి అవుతున్న సూర్యా భాయ్ ఆభరణాలన్నీ నకిలీవేనని తెలిసింది. ఢిల్లీ విమానాశ్రయంలో ఇటీవల పట్టుబడిన మరో గోల్డ్‌మ్యాన్ కొండా విజయ్ కుమార్ ఇచ్చిన సమాచారంతో ఈ ‘రోల్డ్ గోల్డ్’ గుట్టు రట్టయ్యింది.
విజయ్‌కుమార్ ఫోన్లోని డేటా ఆధారంగా సూర్యా భాయ్‌ను విచారించిన ఐటీ అధికారులు, అతను ధరించిన 32 సెట్ల ఆభరణాలను పరీక్షించారు. అవి కేవలం రాగిపై బంగారు పూత పూసినవని, వాటి మొత్తం విలువ రూ. 3 లక్షలేనని నిర్ధారించారు. సినిమాల్లో అవకాశాలు, సోషల్ మీడియా గుర్తింపు కోసమే ఈ విధమైన ఆడంబరాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. ఆదాయపు పన్ను రికార్డుల ప్రకారం ఇతనికి ఎటువంటి స్థిరాస్తులు లేవని, అద్దె ఇంట్లోనే నివసిస్తున్నాడని అధికారులు గుర్తించారు. దీంతో సూర్యా భాయ్ రోల్డ్ గోల్డ్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మెుదలయ్యాయి. చాలా మంది అతడి వ్యవహారం తెలిసి విమర్శలు చేస్తున్నారు. ‘భలే మేనేజ్ చేశావన్నా’ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
తిరుమలలో గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్ సందడి.. అమ్మో అంత బంగారమా!
ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ట్రోల్స్‌కు సూర్యా భాయ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తన వద్ద ఉన్నది ఫేక్ గోల్డ్ అని మీరెలా డిసైట్ చేస్తారంటూ ట్రోలర్స్‌పై ఫైరవుతున్నారు. ఇప్పటి వరకు ఎవరూ ధరించని విధంగా శ్రీవారి నామాలతో ఓ కడెం చేయించుకున్నాని అది మార్కెట్లో ఎవరి వద్ద లేదని అన్నారు. దాని తర్వాతే కావాలనే కొందరు తనపై ట్రోల్స్ చేస్తున్నారని సూర్యా భాయ్ ఫైరయ్యారు.
‘ఈ ప్రచారం వెనుక ఎవరున్నారో నాకు తెలుసు. నన్ను డీఫేం చేయటానికి ట్రై చేస్తున్నారు. నా గురించి నీచంగా వీడియోలు పెడుతున్నారు. నీనేమైనా క్రిమినల్నా.. మర్డర్లు, మానభంగాలు చేశానా.. అక్రమాస్తులు ఉన్నాయా.. నేనేమైన నేరం చేశానా.. నాకున్న ఆస్తులు, బంగారం మీరు చూశారా..? రాజకీయ ముసుగులో వందల కోట్లు దోచేశానా.. బ్లాక్ మనీ ఏమైనా నా వద్ద ఉందా.. నేను ఎవర్నైనా ముంచానా..? అదేం లేదు కదా.. నేను తప్పు చేసినట్లు ఒక్కరితో చెప్పించినా దేశం వదిలి వెళ్లిపోతా. నేను సొంత కష్టంతో పైకి వచ్చా.. తాతలు సంపాదించిన ఆస్తులు నాకు లేవు.
జీరో నుంచి పైకి వచ్చిన. మళ్లీ జీరోకి పోయినా నాకు నో ప్రాబ్లం. మీడియో ముసుగులో కొందరు నాపై ట్రోల్స్ చేస్తున్నారు. నేను మంచిగా బతుకుతున్నందుకే ఈర్ష్య. సమాజంలో బతికి చూపించాలి. గెలిచి చూపించాలి. పైసా విలువ నాకు తెలుసు. అందుకే సైలెంట్‌గా ఉంటున్నా. నేను పార్టీల పేరు చెప్పి కబ్జాలు చేయలేదు. సెటిల్మెంట్లు చేయలేదు. నా సొంతంగా సంపాదించుకున్నా. మీడియా పేరుతో కొందరు ఫేక్ న్యూస్ ఇస్తున్నారు. మీరు మంచి చేయరు. మంచి చేసేవాడిని చేయనియ్యరు. నా గురించి మీకెందుకు. నేను సమాజానికి మంచి చేస్తున్నా. అందిరిలాగా సమాజాన్ని దోచుకోవటం లేదు. రాజకీయ ముసుగులో స్కాంలు చేయటం లేదు.’ అని సూర్యా భాయ్ మండిపడ్డారు.