అనంతపురం: భర్త గ్యాస్ సిలిండర్ తేలేదని భార్య ఆత్మహత్యాయత్నం
అనంతపురం: భర్త గ్యాస్ సిలిండర్ తేలేదని భార్య ఆత్మహత్యాయత్నం
భర్త గ్యాస్ సిలిండర్ తీసుకురాలేదనే కారణంతో భార్య ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన.. అనంతపురం జిల్లా గుత్తి మండలంలో చోటుచేసుకుంది. తొండపాడు గ్రామానికి చెందిన మహాలక్ష్మి అనే మహిళ.. తన భర్త మూడు నెలలుగా గ్యాస్ సిలిండర్ తేలేదనే కోపంతో ఆత్మహత్యకు యత్నించింది. తాను ఎంతగా చెప్తు్న్నా సిలిండర్ తేవటం లేదనే మనస్తాపంతో మహాలక్ష్మి బలవన్మరణానికి యత్నించారు. అయితే కుటుంబసభ్యులు సకాలంలో గుర్తించి ఆస్పత్రికి తరలించటంతో.. ప్రాణాలతో బయటపడ్డారు.
Wife for Gas cylinder
గ్యాస్ సిలిండర్ కోసం భార్య
మహిళలకు స్వతహాగా కాస్త ఓపిక, సహనం ఎక్కువని పెద్దలు చెప్తుంటారు. అందుకే భూమిని కూడా భూమాత అని పిలుస్తుంటాం. అయితే ఈ మధ్య కాలంలో మహిళల్లో ఓపిక పాళ్లు తగ్గుతున్నాయా.. లేక పరిస్థితులే ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అనంతపురం జిల్లాలో జరిగిన ఘటనను చూస్తే ఇది నిజమనిపించకమానదు. భర్త గ్యాస్ సిలిండర్ తేవటం లేదనే మనస్తాపంతో ఓ భార్య ఆత్మహత్యకు యత్నంచిన వైనం గుత్తి మండలంలోని తొండపాడు గ్రామంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
హరికృష్ణ, మహాలక్ష్మి అనే దంపతులు తొండపాడులో కాపురం ఉంటున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ఎలాగోలా సంసారాన్ని నెట్టుకుంటూ వస్తు్న్నారు. ఈ క్రమంలోనే మూడు నెలల కిందట హరికృష్ణ ఇంట్లో వంట గ్యాస్ ఖాళీ అయ్యింది. దీంతో గ్యాస్ సిలిండర్ తేవాలని మహాలక్ష్మి.. హరికృష్ణకు చెప్పింది. అయితే డబ్బులు లేవనే కారణంతో మూడు నెలలుగా హరికృష్ణ ఈ విషయాన్ని నాన్చుతూ వచ్చాడు. దీంతో కట్టెలపొయ్యిపైనే వంట చేస్తూ వచ్చింది మహాలక్ష్మి. అయితే హరికృష్ణకు ఇటీవలే డబ్బులు అందాయి. దీంతో హరికృష్ణ గ్యాస్ సిలిండర్ కోసం గుత్తికి వెళ్లాడు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా గ్యాస్ సిలిండర్ల డెలివరీ ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే.
దీంతో హరికృష్ణకు సిలిండర్ దొరకలేదు. ఈ విషయాన్నే భార్య మహాలక్ష్మికి తెలియజేశాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య కాస్త వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. అయితే తాను ఎంత మొత్తుకున్నా కూడా భర్త గ్యాస్ సిలిండర్ తీసుకురావటం లేదనే మనస్తాపంతో ఆదివారం రోజున మహాలక్ష్మి ఫినాయిల్ తాగేసింది. అయితే కుటుంబసభ్యులు సకాలంలో గుర్తించి ఆమెను గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మహాలక్ష్మికి చికిత్స అందించిన వైద్యులు.. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు.
దీంతో హరికృష్ణ కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గ్యాస్ సిలిండర్ కోసం ఆత్మహత్యకు యత్నించిన వైనం మాత్రం.. స్థానికంగా చర్చనీయాంశమైంది. పరిస్థితులను అర్థం చేసుకుని సర్దుకుపోవాలే కానీ.. క్షణికావేశంలో ఇలాంటి పనులు ఏమిటని స్థానికులు మండిపడుతున్నారు. ఏమీ జరగలేదు కావున సరిపోయిందని.. జరగరానిది జరిగితే నష్టపోయేది ఎవరని ఆమె నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.