Rohit Sharma: “13 మందే అందుబాటులో ఉన్నారు.. మిగిలిన ప్లేయర్లు..”: మూడో వన్డేకు ముందు రోహిత్ శర్మ కామెంట్లు
Rohit Sharma: ఆస్ట్రేలియాతో మూడో వన్డేకు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. ప్రస్తుతం 13 మంది ప్లేయర్లే అందుబాటులో ఉన్నారని చెప్పాడు. మరిన్ని వివరాలు వెల్లడించాడు.
Rohit Sharma: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‍లో తొలి రెండు మ్యాచ్‍లు గెలిచింది టీమిండియా. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‍ను ఖాయం చేసుకుంది. ఇక భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే బుధవారం (సెప్టెంబర్ 27) రాజ్‍కోట్ వేదికగా జరగనుంది. తొలి రెండు వన్డేలకు రెస్ట్ తీసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, కుల్‍దీప్ యాదవ్ మూడో మ్యాచ్‍కు తిరిగి వచ్చేశారు. అయితే, సుమారు ఐదుగురు ఆటగాళ్లకు వివిధ కారణాల వల్ల మూడో మ్యాచ్‍కు విశ్రాంతి ఇవ్వాల్సి వచ్చింది. వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5న మొదనుకానుండగా.. భారత్‍కు గాయాల భయం కూడా ఉంది. అక్షర్ పటేల్ ఇప్పటికీ కోలుకోలేదు. తొలి రెండు మ్యాచ్‍లు ఆడిన శుభ్‍మన్ గిల్ స్వల్ప అనారోగ్యం కారణంగా మూడో వన్డేకు అందుబాటులో లేడు. ఈ నేపథ్యంలో ఆసీస్‍తో మూడో వన్డే ముందు నేడు (సెప్టెంబర్ 26) ప్రెస్‍మీట్‍లో మాట్లాడాడు కెప్టెన్ రోహిత్ శర్మ. కీలక విషయాలను వెల్లడించాడు.
“కొందరు ఆటగాళ్లు అందుబాటులో లేరు. వ్యక్తిగత కారణాలతో ఇళ్లకు వెళ్లారు. మరికొందరి ఆరోగ్యం బాగోలేదు. కొందరికి రెస్ట్ ఇచ్చాం. ప్రస్తుతం 13 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు” అని రోహిత్ శర్మ చెప్పాడు. మూడో వన్డేకు సెలెక్టర్లు 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించగా.. ఇప్పుడు 13 మందే జట్టుతో ఉన్నారని రోహిత్ మాటలతో అర్థమైంది.
“గిల్‍కు రెస్ట్ ఇచ్చాం. మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా, షార్దూల్ ఠాకూర్ వ్యక్తిగత కారణాలతో ఇంటికి వెళ్లారు. అక్షర్ పటేల్ ఈ మ్యాచ్‍కు కూడా అందుబాటులో లేడు” అని రోహిత్ శర్మ చెప్పాడు. జట్టులో వైరల్ సిక్‍నెస్ ఉందని, దీంతోనే అనిశ్చితి ఏర్పడిందని హిట్‍మ్యాన్ చెప్పాడు.
“జట్టులో కాస్త వైరల్ సిక్‍నెస్ వచ్చింది. దీంతో ప్రస్తుతం చాలా అనిశ్చితి ఏర్పడింది. ఇది మన చేతుల్లో లేదు” అని రోహిత్ చెప్పాడు. రానున్న కొన్ని వారాలు తమకు చాలా ముఖ్యమైనవని, అందుకే అందరూ బాగుండేలా చూసుకోవడం చాలా ముఖ్యమని చెప్పాడు. అందుకే ఇప్పుడు కొందరు ఇళ్లకు వెళ్లినా సరేనని అన్నాడు. వన్డే ప్రపంచకప్ (అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19)కు అందరూ ఫ్రెష్‍గా ఉండాలని తాము అనుకుంటున్నట్టు రోహిత్ శర్మ చెప్పాడు.
ఆస్ట్రేలియాతో మూడో వన్డేకు భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా/వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్‍దీప్ యాదవ్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్