Jowar Vegetable Khichdi: వెజిటేబుల్ జొన్నల కిచిడీ.. ఉదయాన్నే తింటే ఆరోగ్యకరం..
Jowar vegetable khichdi: జొన్నలు, రకరకాల కూరగాయలు కలిపి చేసే ఆరోగ్యకరమైన అల్పాహారం జొన్నల కిచిడీ. ఉదయాన్నే దీన్ని తింటే ఆరోగ్యకరం. అదెలా తయారు చేసుకోవాలో చూసేయండి.
ఉదయాన్నే అల్పాహారంలోకి జొన్నలు, పెసరపప్పు, కూరగాయలు కలిపి చేసుకునే కిచిడి ఎప్పుడైనా ప్రయత్నించారా. దీంట్లో బియ్యం వేయాల్సిన అవసరం లేదు. ఇష్టమైన కూరగాయలతో మసాలాలు లేకుండా రుచికరమైన అల్పాహారం చాలా సులువుగా సిద్ధమవుతుంది. దీన్ని మసాలా పాపడ్ లేదా ఏదైనా ఊరగాయతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
కావాల్సిన పదార్థాలు:
సగం కప్పు జొన్నలు
సగం కప్పు పెసరపప్పు
పావు కప్పు బటానీ
పావు కప్పు క్యారట్ ముక్కలు
కొద్దిగా కొత్తిమీర తరుగు
సగం చెంచా జీలకర్ర
1 చెంచా నెయ్యి లేదా నూనె
సగం చెంచా పసుపు
1 పచ్చిమిర్చి
సగం చెంచా అల్లం తురుము
కొద్దిగా ఇంగువ
తగినంత ఉప్పు
తయారీ విధానం:
ముందుగా జొన్నలను, పెసరపప్పును శుభ్రంగా కడుక్కోవాలి. జొన్నలను 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి.
పెసరపప్పును కిచిడీ చేసుకునే కన్నా అరగంట నుంచి గంట ముందు నానబెట్టుకోవాలి.
ఇప్పుడు కుక్కర్లో నెయ్యి లేదా నూనె వేసుకుని వేడెక్కాక జీలకర్ర వేసుకోవాలి. కాసేపాగి అల్లం తురుము, పచ్చిమిర్చి, ఇంగువ కూడా వేసుకుని కలపాలి.
ఇప్పుడు కూరగాయ ముక్కలు, పసుపు వేసుకుని అన్నీ కలిసేలాగా బాగా కలియబెట్టాలి.
కూరగాయల ముక్కలు కాస్త మెత్తబడ్డాక నానబెట్టుకున్న జొన్నలు, పెసర్లు, 3 నుంచి 4 కప్పుల నీళ్లు, ఉప్పు, కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకోవాలి.
ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని 4 నుంచి 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. అంతే మూత తీసి వేడివేడిగా వడ్డించుకోవడమే.
పెరుగుతో, ఊరగాయతో లేదా ఏదైనా పాపడ్ తో సర్వ్ చేసుకుంటే సరి.