Egg Fritters Recipe : వేడి వేడి ‘మసాలా ఎగ్ ఫ్రిట్టర్స్’.. ఒక్కసారి తింటే ఆ రుచిని అస్సలు మర్చిపోలేరు!
ప్రతిరోజూ తినే ఆమ్లెట్, హాఫ్ బాయిల్డ్ బోర్ కొట్టాయా? అయితే ఈ సాయంత్రం కొంచెం వెరైటీగా ‘మసాలా ఎగ్ ఫ్రిట్టర్స్’ ప్రయత్నించి చూడండి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలాల మిశ్రమంతో కోటింగ్ ఇచ్చి చేసే ఈ ఫ్రిట్టర్స్ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చల్లని సాయంత్రం వేళ వేడి వేడి టీతో ఈ స్నాక్ తింటే ఆ మజాయే వేరు.
ఈ రెసిపీలో ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి వాడతాం, కానీ ఒకవేళ అది ఇంట్లో లేకపోతే పులిసిన ఇడ్లీ పిండిని కూడా ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది పిండికి మంచి పట్టును ఇవ్వడమే కాకుండా ప్రత్యేకమైన రుచిని కూడా జోడిస్తుంది. తక్కువ ఖర్చుతో, ఇంట్లో ఉన్న పదార్థాలతోనే స్ట్రీట్ స్టైల్ రుచిని ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు :
ఉడికించిన గుడ్లు: 3 (సగానికి కోయాలి)
పెద్ద ఉల్లిపాయలు: 3 (పొడవుగా కోసినవి)
శనగపిండి: 1/4 కప్పు
బియ్యం పిండి: 3 చెంచాలు (లేదా ఇడ్లీ పిండి)
కారం: 1 స్పూన్
పచ్చిమిర్చి: 1 (సన్నని తరుగు)
పసుపు: కొద్దిగా
గరం మసాలా: 1/2 చెంచా
మిరియాల పొడి: 1/4 చెంచా
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1/2 స్పూన్
కొత్తిమీర, ఉప్పు, బేకింగ్ సోడా: తగినంత
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం :
ఒక గిన్నెలో పొడవుగా కోసిన ఉల్లిపాయలు, శనగపిండి, బియ్యం పిండి (లేదా ఇడ్లీ పిండి), కారం, పచ్చిమిర్చి, పసుపు, గరం మసాలా, మిరియాల పొడి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉప్పు మరియు చిటికెడు బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి.
ఉల్లిపాయల నుండి వచ్చే తేమ సరిపోకపోతే, కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు.
ఇప్పుడు సగానికి కోసిన గుడ్డు ముక్కను తీసుకుని, దాని చుట్టూ ఈ ఉల్లిపాయ మసాలా మిశ్రమాన్ని ఒక బంతిలాగా (బాల్) కప్పి ఉంచాలి.
పాన్ లో నూనె వేడి చేసి, మంటను మధ్యస్థంగా ఉంచి, ఈ ఎగ్ బాల్స్‌ను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
వేడి వేడి మసాలా ఎగ్ ఫ్రిట్టర్స్ సిద్ధం! వీటిని టొమాటో కెచప్ లేదా గ్రీన్ చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.