ఒకరు స్వీపర్.. మరొకరు బజ్జీల విక్రేత.. కట్ చేస్తే నేడు కౌన్సిలర్లు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సామాన్యులు సత్తా చాటారు. అప్పటి వరకు రాజకీయం అంటే తెలియని వాళ్లు ఎన్నికల బరిలో నిలిచి గెలుపు రుచి చూశారు. సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల మున్సిపాలిటీలో స్వీపర్‌గా పని చేసిన మహిళ.. అదే మున్సిపాలిటీలో నేడు కౌన్సిలర్‌గా అడుగుపెడుతున్నారు. ఇక ఆసిఫాబాద్‌లో బజ్జీల బండి నడిపే ఓ చిరు వ్యాపారి కౌన్సిలర్‌గా విజయం సాధించారు.
హైలైట్:
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు
విజేతలుగా సామాన్యులు
తొలిసారిగా కౌన్సిలర్లుగా విజయం
municipal elections
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఉత్కంఠ రేపిన ఈ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మొత్తం 116 పురపాలక సంఘాలకు ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగ్గా.. 66 చోట్ల కాంగ్రెస్ పూర్తి ఆధిక్యాన్ని సాధించింది. బీఆర్ఎస్ 13 స్థానాలను గెలుచుకోగా.. బీజేపీ ఒక్క మున్సిపాలిటీ కూడా దక్కించులేకపోయింది. ఇక 7 మున్సిపల్ కార్పొరేషన్లలో 3 కాంగ్రెస్ ఖాతాలో చేరిపోగా.. మరో మూడు చోట్ల హంగ్ ఏర్పడినా కాంగ్రెస్ పార్టీనే దక్కించుకనే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ ఖాతా తెరవకపోగా.. బీజేపీ కరీంనగర్ కార్పొరేషన్‌ను దక్కించుకుంది. ఇక ఈ ఎన్నికల్లో సామాన్యులు కౌన్సిలర్లుగా గెలుపొందారు. అప్పటి వరకు రాజకీయాలు అంటే ఏంటో తెలియని వారు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో చాలా ఏళ్లు స్వీపర్‌గా పనిచేసిన ఇంజమూరి వెంకటమ్మ 2019లో పదవీ విరమణ చేశారు. తాజా ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్‌గా గెలిచారు. పదో వార్డులో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ఆమె.. 317 ఓట్లు సాధించారు. ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మచ్చ వాణికి 307 ఓట్లు రాగా.. పది ఓట్ల స్వల్ప మెజారిటీతో వెంకటమ్మ గెలుపొందారు. ఏ మున్సిపాలిటీలో స్వీపర్‌గా పని చేసిందో ఇప్పుడు అదే మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా అడుగుపెట్టబోతుంది. ఆమె విజయం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో బజ్జీల బండి నిర్వహించే సాధారణ మహిళ కౌన్సిలర్‌గా విజయం సాధించారు. గుబిడే నాగుబాయి అనుకోకుండా బరిలో దిగి విజయాన్ని సాధించింది. స్థానికంగా ప్రతి ఒక్కరి అవసరాల్లో ముందుండే నాగుబాయి… దుర్గా, శారదాదేవి విగ్రహాల ప్రతిష్ఠ సమయంలో అందర్ని ముందుండి నడిపించేవారు. ఈసారి ఆసిఫాబాద్ 19వ వార్డు జనరల్ మహిళకు రిజర్వు కావడంతో స్థానిక యువత, పెద్దలు ఆమెను పోటీకి ఒప్పించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇప్పించి బరిలోకి దింపారు. దీంతో సత్తా చాటిన ఆమె.. 58 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గతంలో ఇళ్లలో సహాయకురాలిగా పని చేసిన నాగుబాయి.. ఈమధ్యే స్థానికంగా చిన్న బజ్జీల బండి ప్రారంభించి ఉపాధి పొందుతున్నారు.
ఇక నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలో ఓ స్వతంత్ర అభ్యర్థి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశాడు. తాళ్ల శ్రీధర్ గౌడ్ అనే వ్యక్తి వరుసగా మూడోసారి విజయం దక్కించుకున్నాడు. 19వ వార్డు నుంచి బరిలో దిగిన ఆయన ఒంటరిగానే పోటీ చేసి గెలిచాడు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా బీజేపీ ప్రత్యర్థిపై గెలుపొందారు. 2020లో బీఆర్ఎస్ అభ్యర్థిపై 128 ఓట్ల మెజార్టీతో, తాజాగా 211 ఓట్ల మెజార్టీతో బీజేపీపై విజయం సాధించారు. శ్రీధర్ గౌడ్ బీఎన్ఆర్ బుల్లెట్స్ యూత్ పేరుతో స్థానకింగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు.