మూడు కార్పొరేషన్లుగా GHMC.. విభజనకు ముహుర్తం ఫిక్స్, ఏ ప్రాంతం ఏ పరిధిలోకి అంటే..?

 మూడు కార్పొరేషన్లుగా GHMC.. విభజనకు ముహుర్తం ఫిక్స్, ఏ ప్రాంతం ఏ పరిధిలోకి అంటే..?

హైదరాబాద్‌ మహానగర పాలనలో సరికొత్త అధ్యాయం మెుదలు కానుంది. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు ఫిబ్రవరి 10తో ముగియనుండటంతో.. అదే రోజున జీహెచ్ఎంసీని మూడుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. పరిపాలనా సౌలభ్యం కోసం నగరాన్ని హైదరాబాద్, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి కార్పొరేషన్లుగా విడగొట్టనున్నట్లు సమాచారం. ఇటీవల పునర్వ్యవస్థీకరించిన పోలీసు కమిషనరేట్ల సరిహద్దులకు అనుగుణంగానే ఈ విభజన ఉండనున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ మహా నగరం వేగంగా విస్తరిస్తోంది. ఈ మేరకు నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సర్కార్ అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఔటర్ రింగు రోడ్డు పరిధిలో ఉన్న 27 మున్సిపాల్టీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ (GHMC)లో విలీనం చేసింది. దాంతో ఒక దశలో జీహెచ్‌ఎంసీ… దేశంలోనే అతిపెద్ద మున్సిపల్‌ కార్పొరేషన్‌గా అవతరించేందుకు సిద్ధమైంది. అయితే పాలనా సౌలభ్యం కోసం జీహెచ్‌ఎంసీని మూడు వేర్వేరు కార్పొరేషన్లుగా విభజించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది. ఈ మేరకు ముహూర్తం కూడా సిద్ధం చేసింది. ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ఫిబ్రవరి 10తో ముగియనుండటంతో.. అదే రోజున జీహెచ్ఎంసీ విభజన ఉత్తర్వులు వెలువడే ఛాన్స్ ఉంది. పెరుగుతున్న జనాభా అవసరాలు, మౌలిక సదుపాయాల కల్పన,పారదర్శక పరిపాలన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల రాజధాని పరిధిలోని పోలీసు కమిషనరేట్లను తెలంగాణ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మున్సిపల్ పరిధిని కూడా అదే పద్ధతిలో పునర్వ్యవస్థీకరించాలని భావిస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి (గతంలో రాచకొండ) కొత్తగా వస్తున్న ‘ఫ్యూచర్‌ సిటీ’ కమిషనరేట్ల భౌగోళిక సరిహద్దులకు అనుగుణంగా కొత్తగా కార్పొరేషన్లు ఏర్పడనున్నాయి. విశ్వసయనీవర్గాల సమాచారం మేరకు.. హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలోకి కోర్ సిటీ, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ప్రాంతాలు రానున్నాయి. శేరిలింగంపల్లి పేరుతో మరో కార్పొరేషన్ ఏర్పాటు కానుడంగా.. ఇందులో ఐటీ హబ్, సైబరాబాద్, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు రానున్నాయి. మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలోకి తూర్పు హైదరాబాద్, మల్కాజిగిరి (రాచకొండ) కమిషనరేట్ పరిధిలోని నివాస ప్రాంతాలు రానున్నట్లు సమాచారం.

జీహెచ్ఎంసీ విభజన ఉత్తర్వులు వెలువడిన 6 నెలల లోపు.. అంటే ఆగస్టు 2026 నాటికి కొత్త కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ లోపు పరిపాలన సజావుగా సాగేందుకు ఇప్పటికే ఐఏఎస్ అధికారుల బదిలీలు పూర్తయ్యాయి. ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్‌తో పాటు, అదనపు కమిషనర్లుగా సృజన, వినయ్‌ కృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *