Khammam Cock Fights: తెలంగాణ పందెం రాయుళ్లు.. ఆంధ్ర సరిహద్దుల్లో ఏర్పాట్లు.!
Khammam Cock Fights: తెలంగాణ పందెం రాయుళ్లు.. ఆంధ్ర సరిహద్దుల్లో ఏర్పాట్లు.!
Khammam Cock Fights: కోడి పందాల సంస్కృతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాంత ప్రత్యేకం అని అందరికీ తెలిసిందే. అయితే ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఈ కోడి పందాలకు ఆకర్షితులవుతున్న పరిస్థితి నెలకొంది.
న్యాయ స్థానాలు సైతం కోడి పందాలను అడ్డుకుంటున్నా సంప్రదాయం పేరుతో సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ లో అనేక చోట్ల కోడి పందాలను నిర్వహించేందుకు బరులు ఏర్పాటు చేశారు. తెలంగాణలోని మధిర నియోజకవర్గానికి కూత వేటు దూరంలోనే ఆంధ్ర సరిహద్దు గ్రామాలు ఉన్నాయి.
దీంతో ఆయా గ్రామాల్లో కోడి పందాలు నిర్వహించేందుకు పందెం రాయుళ్లు అనేక ఏర్పాట్లు చేశారు. మధిరకు సరిహద్దులో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఊటుకూరు, నెమలి, వినగడప, పెనుగంచిప్రోలు, వత్సవాయి, లింగాల, చీమలపాడు, తిరువూరు, మైలవరం, పెద్దాపురం తదితర గ్రామాల్లోని మామిడి తోటల్లో కోడి పందాలతో పాటు జూదం, నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.
మామిడి తోటల్లో ప్రత్యేకంగా బరులు ఏర్పాటు చేసి వాటి చుట్టూ రక్షణగా రాతి స్తంభాలను పాతి వాటికి ఇనుప తీగతో ప్రత్యేకంగా కంచెను ఏర్పాటు చేశారు. పందాలు నిర్వహించే చోట మాంసాహారంతో భోజనం, మందు సైతం అందుబాటులో ఉంచారు.
కోడి పందాలు చూసేందుకు మధిర నియోజకవర్గం నుంచి ప్రజలు భారీ స్థాయిలో తరలి వెళుతున్నారు. ప్రతియేటా కోడి పందాల్లో పాల్గొనే తెలంగాణ పందెం రాయుళ్లు భారీనే అక్కడికి తరలి వెళ్లి కోడి పందాల్లో పాలు పంచుకుని ఆనందం పొందుతున్నారు.