TSRTC Zero Ticket : రేపటి నుంచి ఆర్టీసీ బస్సులో జీరో టికెట్లు జారీ, గుర్తింపు కార్డు తప్పనిసరి- సజ్జనార్

 TSRTC Zero Ticket : రేపటి నుంచి ఆర్టీసీ బస్సులో జీరో టికెట్లు జారీ, గుర్తింపు కార్డు తప్పనిసరి- సజ్జనార్

TSRTC Zero Ticket : మహిళలకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది ప్రభుత్వం. రేపటి నుంచి బస్సుల్లో మహిళలకు జీరో టికెట్లు జారీ చేస్తామని ఎండీ సజ్జనార్ తెలిపారు.

TSRTC Zero Ticket : మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకం అమల్లో భాగంగా రేపటి (శుక్రవారం) నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రతీ ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్ తీసుకుని సంస్థకు సహకరించాలని సజ్జనార్ కోరారు. మహిళలకు జీరో టికెట్ల జారీపై క్షేత్ర స్థాయి అధికారులతో గురువారం సాయంత్రం ఆయన వర్చువల్ గా సమావేశం నిర్వహించారు.

గుర్తింపు కార్డు తప్పనిసరి

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యానికి మహిళల నుంచి మంచి స్పందన వస్తోందని సజ్జనార్ తెలిపారు. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ప్రశాంతంగా ఈ పథకం అమలవుతోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సాప్ట్ వేర్ ను సంస్థ అప్ డేట్ చేసిందన్నారు. ఆ సాప్ట్ వేర్ ను టిమ్ మెషిన్లలో ఇన్ స్టాల్ చేస్తున్నామన్నారు. మెషిన్ల ద్వారా శుక్రవారం నుంచి జీరో టికెట్లను సంస్థ జారీ చేస్తుందన్నారు. మహిళా ప్రయాణికులకు తమ వెంట ఆధార్, ఓటరు, తదితర గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలన్నారు. స్థానికత ధృవీకరణ కోసం వాటిని కండక్టర్లకు చూపించి విధిగా జీరో టికెట్లను తీసుకోవాలన్నారు. ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని….మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు ఉపయోగించుకోవాలని అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు.

అధికారులను అభినందించిన సజ్జనార్

సజ్జనార్ మాట్లాడుతూ….మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ఉచిత ప్రయాణ సౌకర్యం సమర్థవంతంగా అమలయ్యేందుకు ప్రతి ఒక్కరూ సంస్థకు సహకరించాలని కోరారు. అతి తక్కువ సమయంలోనే జీరో టికెట్ కోసం సాప్ట్ వేర్ ను అప్ డేట్ చేసి….అందుబాటులో తీసుకువచ్చిన టీఎస్ఆర్టీసీ అధికారులను ఈ సందర్భంగా సజ్జనార్ అభినందించారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *