APSRTC బస్సులో చంద్రబాబు ప్రయాణం-ప్రయాణికులతో చిట్ చాట్..
ఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా జిల్లాల్లో వరుస టూర్లు నిర్వహిస్తున్న విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కొత్త పేట నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్ధానికంగా ఓ ఆర్టీసీ బస్సులో ఎక్కి ప్రయాణం చేశారు. ఈ ప్రయాణంలో బస్సులోని ప్రయాణికులతో ఆయన ముఖాముఖీ మాట్లాడారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. దీంతో చంద్రబాబు బస్సు ప్రయాణం ప్రాధాన్యం సంతరించుకుంది.
బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్త పేట నియోజకవర్గంలో ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారంటీ ప్రచారం నిర్వహించారు. ఇందులో స్ధానికులకు టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే హామీల్ని స్వయంగా వివరించారు.తెలుగుదేశం ప్రభుత్వంతోనే సర్పంచ్ లకు హక్కులు, గౌరవం లభిస్తాయని చంద్రబాబు తెలిపారు. నిధుల కోసం సర్పంచ్ ల పోరాటంతో జగన్ పారిపోవాలని తెలిపారు. సర్పంచ్ ల అధికారాలు తీసేసిన ఈ ముఖ్యమంత్రి అధికారం తొలగిస్తే ఊరుకుంటాడా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
అనంతరం నియోజకవర్గంలోని ఆలమూరు గ్రామంలో చంద్రబాబు ఆర్టీసీ బస్సు ఎక్కారు. అప్పటికే బస్సులో ప్రయాణిస్తున్న మహిళల పక్కనే కూర్చున్నారు. భవిష్యత్ కు గ్యారెంటీ ప్రచార కార్యక్రమంలో భాగంగా బస్సులో ప్రయాణించి మహిళలతో మాట్లాడారు. భారంగా మారిన నిత్యావసర వస్తువుల ధరలు, ప్రభుత్వ పన్నుల పై మహిళలు చంద్రబాబుతో మాట్లాడుతూ తమ అవేదన వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబుతో చిట్ చాట్ లో మహిళలు కరెంట్ బిల్లులు వేలల్లో వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. అలాగే కరెంటు బిల్లులు తమకు తీవ్ర భారం గా మారాయని చెప్పారు. మహిళలకు టీడీపీ ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం పై మహిళలు హర్షం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగం గా ప్రకటించిన మహా శక్తి పథకం లబ్ధిని మహిళలకు వివరించిన చంద్రబాబు.. తాము అధికారంలోకి వస్తే ఆరు పథకాల్ని కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు.