హైదరాబాద్‌లోనూ హోటళ్ల బంద్..? కమర్షియల్ సిలిండర్ల కొరతతో యాజమాన్యాల ఆందోళన
పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. ఫలితంగా కమర్షియల్ సిలిండర్ల కొరత ఏర్పడి హోటల్ రంగం సంక్షోభంలో పడింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని 6 వేల హోటళ్లపై దీని ప్రభావం పడుతుండటంతో బెంగళూరు తరహాలో సమ్మెకు సిద్ధమవుతూ తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర భేటీ అయ్యింది.
హైలైట్:
కమర్షియల్ సిలిండర్ల కొరత
హైదరాబాద్‌లోనూ హోటళ్ల బంద్..?
యాజమాన్యాల ఆందోళన
Commercial Gas Crisis
వేధిస్తున్న కమర్షియల్ గ్యాస్ కొరత
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్ దేశంపై ఇజ్రాయెల్-అమెరికా కలిసి సంయుక్తంగా దాడులు చేస్తోంది. ఇరాన్ కూడా ప్రతి దాడులకు దిగుతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలతో పాటు, చమురు క్షేత్రాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఫలితంగా యుద్ధ ప్రభావం వివిధ దేశాలపై పడుతోంది. భీకర దాడుల వల్ల అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ సరఫరా తగ్గిపోయింది. పశ్చిమాసియా యుద్ధం సెగ మన దేశంలో గ్యాస్ వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా మెట్రో నగరాలైన ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి.
గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడటంతో.. దేశీయ అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగదారులకు అంటే డొమెస్టిక్ సిలిండర్లు, రైతులకు అవసరమైన ఎరువుల తయారీ ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్‌లకు గ్యాస్ సరఫరాలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించింది. సరఫరాలో ఎటువంటి అడ్డంకులు కలగకుండా ఉండేందుకు చమురు శుద్ధి సంస్థలపై ఇప్పటికే ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం హోటల్ పరిశ్రమను తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్యాస్ కంపెనీలు డొమిస్టిక్ సిలిండర్లకు ప్రాధాన్యం ఇస్తుండటంతో కమర్షియల్ సిలిండర్ల సరఫరా గణనీయంగా తగ్గింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు నిర్వహణ భారంగా మారింది.
Gas Price Hike: సామాన్యులపై గుది ‘బండ’- సడెన్‌గా పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర
కమర్షియల్ సిలిండర్ల కొరత కారణంగా హోటళ్లలో పొయ్యి వెలగని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే చెన్నై హోటల్స్ అసోసియేషన్ ఈ సంక్షోభంపై కేంద్రానికి మొరపెట్టుకుంది. బెంగళూరులో హోటల్స్ యాజమాన్యాలు హోటళ్లు, రెస్టారెంట్లు మూసేసి సమ్మెకు దిగి నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ముంబైలోనూ 20 శాతం మేర హోటళ్లు మూతపడ్డాయి. తాజాగా.. ఈ గ్యాస్ కొరత వేడి తెలంగాణకు కూడా తాకింది. రాష్ట్రంలో కమర్షియల్ సిలిండర్ల కొరతపై ఆందోళన వ్యక్తం చేస్తూ తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అత్యవసరంగా సమావేశమైంది. కేవలం హైదరాబాద్ నగరంలోనే సుమారు 6 వేల హోటళ్లపై ఈ ప్రభావం పడుతుండటంతో హోటళ్ల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గిరాకీ ఉండే రంజాన్ మాసంలో గ్యాస్ సరఫరా లేకుంటే నిర్వహణ కష్టమని నిర్వహకులు భావిస్తున్నారు.
బెంగళూరు తరహాలోనే తెలంగాణలో కూడా హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేసి సమ్మెకు వెళ్లాలా? లేక ప్రభుత్వంతో చర్చలు జరపాలా? అనే అంశంపై తీవ్రంగా సమాలోచనలు చేస్తున్నాయి. గ్యాస్ సంక్షోభం త్వరగా సమసిపోకుంటే రాష్ట్రంలో పర్యాటక, సేవా రంగం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు.