విద్యార్థులకు పండగే.. ఆ జిల్లాలో రెండ్రోజుల సెలవులు.. కలెక్టర్ ఉత్తర్వులు జారీ
నల్గొండ జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుడ్‌న్యూస్. రెండ్రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అయితే ఈ సెలవులు మున్సిపల్ ఎన్నికలు జరిగే పట్టణాలకు మాత్రమే వర్తించనున్నాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
హైలైట్:
విద్యార్థులకు పండగే
నల్గొండ జిల్లాలో రెండ్రోజుల సెలవులు
కలెక్టర్ ఉత్తర్వులు జారీ
Nalgonda Two days holiday
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ రెండ్రోజుల పాటు సెలవు ప్రకటించారు. జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు నేడు (ఫిబ్రవరి 10), రేపు (ఫిబ్రవరి 11 )రెండు రోజుల పాటు సెలవు ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి. చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ ఉత్తర్వులు నల్గొండ కార్పొరేషన్, నందికొండ, చండూరు, దేవరకొండ, చిట్యాల, మిర్యాలగూడ, హాలియా మున్సిపాలిటీలకు వర్తిస్తాయని వెల్లడించారు. ఆయా పట్టణాల పరిధిలోని ప్రవేటు, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకు ఈ సెలవు వర్తిస్తుందని చెప్పారు.
ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 11న పెయిడ్ హాలిడే ప్రకటిస్తూ లేబర్, ఫ్యాక్టరీస్ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ జారీచేసింది. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగానికి అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫ్యాక్టరీలు, షాపులు, సంస్థలకు హాలిడే వర్తిస్తుందన్నారు. కాగా, ఈనెల 13న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరగనుండగా.. ఆ రోజు కూడా రాష్ట్రంలోని కౌటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది. ఆ తరువాతి రోజు ఫిబ్రవరి 14న రెండో శనివారం, ఫిబ్రవరి 15 ఆదివారం కూడా సెలవు ఉండనుంది.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వైన్స్, బార్లు, కల్లు దుకాణాల బంద్ అమల్లోకి వచ్చింది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ పోలింగ్ ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అటు ఫలితాలు వెల్లడయ్యే 13వ తేదీ కూడా బంద్ పాటించనున్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఈ నెల 11న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. దీంతో 48 గంటల ముందే అన్ని రకాల ప్రచారాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. సభలు, ర్యాలీలు, ఊరేగింపులతో పాటు టీవీ, సినిమా, సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ ప్రచారాలపై ఆంక్షలు అమల్లో ఉండనున్నాయని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.