టెన్త్ స్టూడెంట్‌పై లైంగిక దాడికి పాల్పడిన టీచర్.. సీక్రెట్ కెమెరాతో మరో ఉపాధ్యాయుడు వీడియో రికార్డ్..!
టెన్త్ స్టూడెంట్‌పై లైంగిక దాడికి పాల్పడిన టీచర్.. సీక్రెట్ కెమెరాతో మరో ఉపాధ్యాయుడు వీడియో రికార్డ్..!
నారాయణపేట జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు 16 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్కూల్ కంప్యూటర్ ల్యాబ్‌లో జరిగిన ఈ దారుణాన్ని మరో టీచర్ రికార్డు చేయగా.. ఈ నిజాన్ని దాచిపెట్టేందుకు ప్రధానోపాధ్యాయుడు, స్థానిక నేతలు ప్రయత్నించారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రధాన నిందితుడు సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. బాధితురాలిపై నిందితుడు గతంలోనూ పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.
హైలైట్:
గురువు ముసుగులో కామాంధుడు
టెన్త్ స్టూడెంట్‌పై లైంగిక దాడికి పాల్పడిన టీచర్
నారాయణపేట జిల్లాలో ఘటన
Teacher Abuses Student
పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పి భావిభారత పౌరులుగా తీర్చిదిద్ది, వారిని సరైన మార్గంలో నడిపించాల్సిన గురువులే దారి తప్పుడుతున్నారు. మెరుగైన సమాజ నిర్మాణంలో మూల స్తంభాలైన ఉపాధ్యాయులే నైతికతను మరచిపోతున్నారు. తమ కూతురు వయసున్న అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ కామ పిశాచుల్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా నారాయణపేట జిల్లా మద్దూరు పాఠశాలలో ఓ టీచర్ చేసిన పని సమాజం తలదించుకునేలా ఉంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 55 ఏళ్ల వయసున్న స్వామి అనే ఉపాధ్యాయుడు టెన్త్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. కంప్యూటర్ ల్యాబ్‌లోకి తీసుకెళ్లి విద్యార్థినిని ముద్దు పెట్టుకున్నాడు. మార్చి 7న ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, అక్కడి సీసీటీవీ కెమెరా పనిచేయడం లేదని భావించిన స్వామి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలిసింది. కానీ, సదరు ఉపాధ్యాయుడి ప్రవర్తనపై అనుమానంతో మరో ఉపాధ్యాయుడు రహస్య కెమెరాను ఏర్పాటు చేయటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ అఘాయిత్యాన్ని రికార్డు చేసిన తోటి ఉపాధ్యాయుడు వెంటనే ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లారు. కానీ, పాఠశాల పరువు పోతుందన్న నెపం, నిందితుడిని కాపాడాలన్న ఉద్దేశంతోనో హెచ్‌ఎం ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియనీయకుండా చేశాడు. స్థానిక సర్పంచ్ భర్తతో సహా మరో నలుగురు వ్యక్తుల సాయంతో బాధితురాలి కుటుంబానికి డబ్బు ఆశ చూపి, రాజీ చేయాలని ప్రయత్నించారు. దీంతో కొన్ని రోజుల పాటు ఈ విషయం బయటకు రాలేదు. అయితే.. నిందితుల్లో ఒకరి నుంచి ఆ వీడియో లీక్ కావడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయి పోలీసుల వరకు చేరింది.
బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన పోలీసులు.. నిందితుడు గతంలో కూడా బాలిక ఇంటికి వెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడి స్వామిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయగా.. సాక్ష్యాధారాలను ధ్వంసం చేసేందుకు, నిజాన్ని దాచేందుకు ప్రయత్నించిన హెచ్‌ఎం, మరో ఉపాధ్యాయుడు, ఐదుగురు ప్రైవేట్ వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన చోటే ఇలాంటి ఘటన జరగడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డబ్బు డిమాండ్ చేయటంతోనే వెలుగులోకి..?
కాగా, ఈ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడిన స్వామిని మరో ఉపాధ్యాయుడు డబ్బులివ్వాలని బెదిరించినట్లు తెలిసింది. సీక్రెట్‌గా వీడియో తీసిన సదరు ఉపాధ్యాయుడు రూ.20 లక్షలు డబ్బులివ్వాలని లేదంటే వీడియో అందరికీ చూపిస్తానని బెదిరించినట్లు సమాచారం. అందుకు స్వామి ఒప్పుకోకపోవటంతో స్థానిక సర్పంచ్ భర్త, మరో నలుగురితో కలిసి సెటిల్మెంట్‌కు దిగారని.. అందులో ఒకరు వీడియో లీక్ చేయటంతో సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు తెలిసింది.