క్యారెక్టర్‌ను ప్రశ్నిస్తూ కాబోయే భార్యకు వేధింపులు.. కఠిన నిర్ణయం తీసుకున్న యువతి
క్యారెక్టర్‌ను ప్రశ్నిస్తూ కాబోయే భార్యకు వేధింపులు.. కఠిన నిర్ణయం తీసుకున్న యువతి
జోగులాంబ గద్వాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కాబోయే భర్త వేధింపులు తాళలేక ఒక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యుల ఆరోపణల మేరకు కాబోయే భర్త అనుమానం, ఫోన్‌లో వేధింపులే ఈ దారుణానికి కారణమని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైలైట్:
కాబోయే భార్యకు వేధింపులు
కఠిన నిర్ణయం తీసుకున్న యువతి
గద్వాల జిల్లాలో ఘటన
young woman suicide
మంగళవాయిద్యాలు మోగాల్సిన ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనుమానం అనే పెనుభూతం ఒక యువతి ప్రాణాలను బలి తీసుకుంది. రేపో మాపో పెళ్లి పీటలు ఎక్కి కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన ఒక నిండు ప్రాణం.. కాబోయే భర్త వేధింపుల తట్టుకోలేక అనంత వాయువుల్లో కలిసిపోయింది. జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళితే.. కేటీదొడ్డి మండలం పరిధిలోని చింతలకుంట గ్రామంకు చెందిన స్నేహ (19)కు అదే మండలంలోని యువకుడు హరికృష్ణతో వివాహం నిశ్చయమైంది. పెళ్లి నిశ్చయం అనంతరం ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకునేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే కొంతకాలంగా హరికృష్ణ.. స్నేహ క్యారెక్టర్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ ఫోన్ ద్వారా తరచూ వేధిస్తున్నట్లు తెలిసింది. ఎక్కడికి వెళ్లావ్.. ఇప్పుడు ఎక్కడ ఉన్నావ్..? ఫలానా అబ్బాయిని నీకు ఎలా పరిచయం.. అతడికి నీకు ఉన్న సంబంధం ఏంటి..? అని గుచ్చి గుచ్చి ప్రశ్నించేవాడు. ఇదే విషయాన్ని స్నేహ తన కుటుంబ సభ్యులకు చెప్పగా.. వారు వరుడి పెద్దలతో మాట్లాడారు. ఆ సమయంలో హరికృష్ణ శివ మాలలో ఉండటంతో అది పూర్తయ్యాక మాట్లాడి సమస్యను పరిష్కరిద్దామని పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది.
కానీ ఈ నెల 18న మళ్లీ ఫోన్ చేసిన హరికృష్ణ.. స్నేహతో అసభ్యంగా మాట్లాడి ఆమెను వేధించాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన స్నేహ ఆత్మహత్యకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యువతి తల్లి మహేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హరికృష్ణను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలపై విచారణ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. హరికృష్ణ వేధింపుల వల్లే యువతి ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి తగిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.