ఇక పక్కాగా రేషన్ సరుకులు.. సేవాలోపంపై ఫిర్యాదులు ఇలా..
ఇక పక్కాగా రేషన్ సరుకులు.. సేవాలోపంపై ఫిర్యాదులు ఇలా..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేషన్ లబ్ధిదారులకు సరుకులు పక్కాగా అందించేందుకు ప్రభుత్వం నిఘా ఏర్పాటు చేసింది. అందుకోసం సివిల్ సఫ్లయ్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు సేవాలోపంపై ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు.
హైలైట్:
పక్కాగా రేషన్ సరుకులు
సివిల్ సఫ్లయ్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక దృష్టి
సేవాలోపంపై ఫిర్యాదులు
Ration beneficiaries complaints
తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల సరఫరా నిలిచిపోగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా పాలన దరఖాస్తులు ద్వారా రేషన్ కార్డులు మంజూరు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ నగరంలోనూ భారీగా కొత్త కార్డులు జారీ చేశారు. కాగా, నగరంలో నిత్యావసర సరకుల సరఫరా పర్యవేక్షణను పటిష్ఠం చేసేలా సివిల్ సఫ్లయ్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక దృష్టి సారించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త రేషన్ కార్డుల సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో సరకుల పంపిణీ పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సరుకులు పక్కదారి పట్టకుండా పర్యవేక్షిస్తున్నారు.
కోర్ హైదరాబాద్ ప్రాంతం ప్రస్తుతం చీఫ్ రేషనింగ్ అధికారి పరిధిలో ఉంది. రంగారెడ్డి జిల్లా, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని పాత గ్రేటర్ ప్రాంతాలు మాత్రం సంబంధిత జిల్లా సివిల్ సఫ్లయ్ అధికారుల పరిధిలో ఉన్నాయి. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మూడు ప్రత్యేక కార్పొరేషన్లుగా మారింది. కానీ పౌరసరఫరాల వ్యవస్థ మాత్రం గతంలో మాదిరి సీఆర్వో, 3 జిల్లాల పౌరసరఫరాలశాఖ పరిధిలోనే యథావిధిగా కొనసాగనున్నాయి. నగరంలో కొత్తగా ఇచ్చిన రేషన్ కార్డులతో మూడు కార్పొరేషన్ల పరిధిలో రేషన్ కార్డుల సంఖ్య మెుత్తం 15.71 లక్షలకు చేరుకున్నాయి. మొత్తం 57.69 లక్షలమందికి ప్రతినెలా నిత్యావసర సరకులు ఇస్తున్నారు. రేషన్‌షాపులపై నిఘాను పెంచడంతో పాటుగా.. ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.
సేవాలోపంపై ఫిర్యాదులు ఇలా
1967 లేదా 1800-425-00333ను కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
ప్రజావాణి వెబ్‌సైట్‌లో పేరు, మొబైల్ నంబరు, మండలం, జిల్లా వివరాలతో ఫిర్యాదుకు ఛాన్స్ కల్పించారు.
పౌరసరఫరాలశాఖ ప్రధాన కార్యాలయ ఎర్రమంజిల్‌లోని సివిల్ సప్లైస్ భవన్‌లోనూ రేషన్ లబ్ధిదారులు తమ సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు.
పౌరసరఫరాలశాఖ పోర్టల్‌లోనూ ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
నేరుగా సీఆర్వో కార్యాలయంలో లేదా జిల్లా పౌర సరఫరాల అధికారికి ఫిర్యాదు చేయవచ్చు.