ఇంటర్ విద్యార్థులకు ఈ-స్కూటర్లు.. నెలకు రూ.2500 స్కాలర్ షిప్, విద్యాశాఖ ప్రతిపాదన
ఇంటర్ విద్యార్థులకు ఈ-స్కూటర్లు.. నెలకు రూ.2500 స్కాలర్ షిప్, విద్యాశాఖ ప్రతిపాదన
తెలంగాణలోని గవర్నమెంట్ ఇంటర్ కాలేజీల్లో చేరే ప్రత్యేక అవసరాల పిల్లలకు ఈ-స్కూటర్లు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 1000 మంది పిల్లలకు స్కూటర్లు పంపిణీ చేయాలని విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అలాగే టెన్త్‌లో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులతో పాటు ట్రాన్‌జెండర్లకు స్కాలర్‌షిప్ ఇవ్వాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
హైలైట్:
ఇంటర్ విద్యార్థులకు ఈ-స్కూటర్లు
నెలకు రూ.2500 స్కాలర్ షిప్
తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ప్రతిపాదన
e junior college students
తెలంగాణలో టెన్త్ తర్వాత డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి. చాలా మంది విద్యార్థులు ఉన్నత చదువులపై ఆసక్తి చూపటం లేదు. ఇక దివ్యాంగులైన ప్రత్యేక అవసరాల పిల్లలు, ట్రాన్స్‌జెండర్లు ఇంటర్‌లో చేరటం లేదు. ఈ నేపథ్యంలో ఇంటర్ విద్యాశాఖ కీలక ప్రతిపాదనలు తెరపైకి తీసుకొచ్చారు. తెలంగాణలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో చేరిన ప్రత్యేక అవసరాల పిల్లలు (చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్- సీడబ్ల్యూఎస్‌ఎన్) ఈ-స్కూటర్లు ఇవ్వాలని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందికి ఈ-స్కూటర్లు అందించాలని డిసైడ్ అయ్యారు. ఈ స్కూటర్లను పెద్ద మొత్తంలో ఒకేసారి కొనుగోలు చేస్తే ఒక్కో ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.50 వేలకే లభిస్తుందని అధికారులు అంచనా.
ప్రత్యేకావసరాల పిల్లలు చదువును మధ్యలోనే నిలిపివేయకుండా కాలేజీలకు వచ్చేందుకు ఈ-స్కూటర్లు ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా స్వయంగా ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకురాగా.. సర్కారు తప్పకుండా ఆమోదం తెలుపుతుందని భావిస్తున్నారు. ఇక టెన్త్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో చేరితే వారికి స్కాలర్‌షిప్‌లు అందించాలనే ప్రతిపాదన కూడా ఉంది. అందుకు ఏడాదికి రూ.10 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ట్రాన్స్‌జెండర్లకు కూడా నెలకు రూ.2,500ల చొప్పున స్కాలర్‌షిప్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు ప్రభుతం ముందుంచనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్‌తో పాటుగా.. వెల్‌కమ్ కిట్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఫస్టియర్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 5,14,598 మందికి 4,98,695 మంది అంటే 96.90 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. 15,903 మంది విద్యార్థులుకు పరీక్షకు గైర్హాజరయ్యారు. మొదటి రోజు రాష్ట్రంలో ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. నేటి నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు మొదలుకానున్నాయి. కాగా, మార్చి 18తో పరీక్షలు ముగియనున్నాయి.