Ysrcp Issue: తప్పంతా ఎమ్మెల్యేలదేనా..? నాయకుడికి ఆ బాధ్యత లేదా?

 Ysrcp Issue: తప్పంతా ఎమ్మెల్యేలదేనా..? నాయకుడికి ఆ బాధ్యత లేదా?

Ysrcp Issue:ఏపీలో అధికార వైసీపీలో ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు.. స్థాన చలనం అంశం కొత్త చర్చకు దారి తీస్తోంది. ఎవరి బాధ్యత ఎంత అనే ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Ysrcp Issue: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు అంశం వేడి పుట్టిస్తోంది. పూటకో పేరు తెరపైకి రావడం.. మంత్రులు, ఎమ్మెల్యేలకు స్థానచలనం, టిక్కెట్ లేదనే వార్తల నడుమ ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి కారణం అవుతోంది.

రానున్న ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో కనీసం మూడో వంతు సభ్యులకు టిక్కెట్లు దక్కకపోవచ్చని చెబుతున్నారు. స్థానిక పరిస్థితులు, ఎమ్మెల్యేల పనితీరు, అవినీతి ఆరోపణలు, ప్రజల్లో అసంతృప్తి వంటివి బేరీజు వేసి వారికి టిక్కెట్లు ఖరారు చేస్తున్నారు. ఇప్పటికే కొందరి పేర్లను అధికారికంగా ప్రకటించారు. నెలాఖరులోగా కనీసం 50 నియోజక వర్గాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని విస్తృతప్రచారం జరుగుతోంది.

2024 ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 నినాదంతో ఏడాది క్రితమే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రతి పక్షమే లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ తమ పార్టీలో ఓ రకమైన ఆత్మ విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు.

అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు అందించిన ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలతో పాటు వివిధ రకాల సంక్షేమ పథకాల ద్వారా కలిగిన ప్రయోజనాన్ని ప్రజలకు ఇంటింటికి వెళ్లి వివరించేలా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు.దాదాపు ఏడాదిన్నర క్రితమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో దాదాపు రెండున్నర లక్షల కోట్ల రుపాయలను ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా నేరుగా ప్రజలకు పంపిణీ చేసినట్టు సిఎం జగన్ పదేపదే చెబుతున్నారు. ఈ విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలదేనని ఆదేశించారు.

ఎవరి ప్రభావం ఎంత..?

2019 ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో వైసీపీకి 49శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. 151 మంది వైసీపీ తరపున ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరిలో చాలామంది, వ్యక్తిగత ఇమేజ్ కంటే పార్టీ ప్రభావంతో గెలిచిన వారే ఉన్నారు. వైసీపీ విజయానికి కారణాలు ఏమిటనేది గుర్తు చేసుకుంటే ఆ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తిరుగుతూ చేసిన పాదయాత్రలు ఎక్కువ ప్రభావం చూపించాయి. 2019లో ఘన విజయం సాధించడంలో టీడీపీ వైఫల్యాలు, వైసీపీ ప్రచారాలు, మ్యానిఫెస్టో కూడా ప్రభావం చూపించాయి.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే సంక్షేమ పథకాల అమలుకు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్లను నియమించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యలో ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. దాదాపు రెండేళ్ల పాటు ఈ వ్యవస్థ కొనసాగిన తర్వాత తమకు ఎలాంటి ప్రాతినిథ్యం లేదని ఎమ్మెల్యేల నుంచి తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తమైన తర్వాత వాలంటీర్లను ఎమ్మెల్యేల పరిధిలోకి తీసుకు వచ్చారు.

నాలుగేళ్లలో మా మాటెప్పుడు విన్నారు…

అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్లలో రెండేళ్లు కోవిడ్ లాక్‌ డౌన్‌లో గడిచిపోయింది. మొదటి ఏడాది అధికారంలో కుదురుకోడానికి సరిపోయిందని… నియోజక వర్గంలో సమస్యలు, అభివృద్ధి పనులు, ప్రజల అవసరాలు వంటి సమస్యల విషయంలో ముఖ్యమంత్రికి నేరుగా చెప్పుకునే అవకాశం తమకు ఎప్పుడు రాలేదని గోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే వాపోయాడు.

తన ప్రాంతంలో కావాల్సిన పనులు మంజూరు చేయించుకోడానికి ముఖ్యమంత్రి దర్శనం దొరకడం కూడా దక్కేది కాదని ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత అంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఎన్టీఆర్ జిల్లాకు ఓ ప్రజా ప్రతినిధి కూడా వైసీపీ నాయకత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికైన తర్వాత నియోజక వర్గం ప్రజలకు ఏమి చేయలేక పోయానని, ప్రజలకు కావాల్సినదంతా ప్రభుత్వం చేసేసింది, కావాల్సినంత సంక్షేమాన్ని ఇచ్చిసిందని చెబుతూ, తాము మాత్రమే ఏమి చేయలేదని పార్టీ భావిస్తే చెప్పడానికి ఏమి ఉంటుందన్నారు. ప్రభుత్వమే ప్రజలకు కావాల్సినదంతా చేస్తే ఎమ్మెల్యే వైఫల్యం అనే ప్రశ్న ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు.

ప్రజల్లో అసంతృప్తి ఎమ్మెల్యే అభ్యర్థుల మీద ఉందంటే పార్టీ మీద కూడా ఉన్నట్టే కదా కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఒకరు విశ్లేషించారు. ప్రభుత్వం, పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను ఎమ్మెల్యేల మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

సంక్షేమ పథకాల అమలు చేశామని చెప్పడం తప్ప, జిల్లాలు, నియోజక వర్గాల వారీగా ఐదేళ్లలో ఏమి అభివృద్ధి చేశారనేది చెప్పుకునే పరిస్థితి లేకపోవడమే అసలు సమస్య అని విజయవాడలో ప్రస్తుతం టిక్కెట్ దక్కదని ప్రచారం జరుగుతున్న ఓ నాయకుడు వివరించారు.

తన మీద ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్టే తనకు కూడా తనకు చాలా అసంతృప్తులు ఉన్నాయని, వాటికి సమాధానం ఎవరు చెబుతారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి దర్శనం కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా దొరకదని, ఒకరిద్దరు అధికారులు, సలహాదారులకు తమ ఇబ్బందులు చెప్పుకోవాల్సి వచ్చేదని అసహ‍నం వ్యక్తం చేశారు.

మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ ఇమేజ్ ఉన్న కొత్త ముఖాలతో ఎన్నికల్లోకి వెళ్లాలన్న వైసీపీ వ్యూహం పార్టీ నాయకుల్లో కొత్త రకం చర్చకు కారణమైంది. వైసీపీ వ్యూహాలు ఎంత మేరకు ఫలితాలన్నిస్తాయనేది ఎన్నికల్లో తేలాల్సి ఉంది. వైసీపీలో పూర్తి స్థాయి నిర్ణయాధికారం జగన్మోహన్ రెడ్డిదే కావడంతో మార్పులు, చేర్పులు, ఫలితాలకు కూడా ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *