Weightloss Salads: రాత్రిపూట ఈ సలాడ్స్ మాత్రమే తినండి, బరువు త్వరగా తగ్గుతారు
Weightloss Salads: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి ఈ సలాడ్స్ ఎంతో సహాయపడతాయి. రాత్రిపూట వీటిని తింటే చాలు, నెల రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.
Weightloss Salads: ప్రపంచంలో ఎక్కువమంది ఎదుర్కొంటున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. ఉబకాయం బారిన పడితే ఎన్నో రకాల రోగాలు దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. బరువు పెరగడం సులువే, కానీ బరువు తగ్గడం మాత్రం చాలా కష్టం. ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకుంటున్న వారికి కొన్ని రకాల సలాడ్స్ ఉన్నాయి. రోజంతా తేలికపాటి ఆహారం తీసుకుంటూ, రాత్రిపూట కేవలం ఈ సలాడ్‌తోనే పొట్ట నింపుకుంటే బరువు త్వరగా తగ్గుతారు. కింద ఇచ్చిన సలాడ్‌లలో మీకు ఏది నచ్చితే దాన్ని ఫాలో అవ్వండి. నెల రోజుల్లోనే బరువును నియంత్రణలో ఉంచుతాయి ఈ సలాడ్లు.
చిక్ పీస్ సలాడ్ తయారీ
దీనిలో ఉడికించిన శనగలను ఒక కప్పు తీసుకోవాలి. ఒక గిన్నెలో ఉడికించిన శనగలను వేసి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన టమోటో ముక్కలు, ఒక కప్పు దోసకాయ ముక్కలు, ఒక స్పూన్ నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి అన్నీ కలుపుకొని రాత్రిపూట తినాలి. ఇది ప్రోటీన్ నిండిన సలాడ్. కాబట్టి మీకు ఎనర్జీతో పాటు ఫైబర్‌ను అందిస్తుంది. శనగలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఎముకలు బలంగా మారుతాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది.
పనీర్ సలాడ్
కొవ్వులేని పాలతో తయారుచేసిన పనీర్ ముక్కలను ఇందుకోసం ఎంచుకోవాలి. 50 గ్రాముల ముక్కలను తీసుకొని ఒక గిన్నెలో వేయాలి. అలాగే చెర్రీ టమోటోలను చిన్నగా తరిగి వాటిలో కలుపుకోవాలి. తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పాలకూర, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, ఒక స్పూను ఆలివ్ నూనె వేసి కలుపుకోవాలి. పనీర్ సలాడ్ రెడీ అయినట్టే. దీన్ని రాత్రి భోజనం సమయంలో తినాలి. ఈ సలాడ్ తిన్నాక మరేమి తినకూడదు.
బీట్రూట్ సలాడ్
ఒక గిన్నెలో కొవ్వులేని పాలతో చేసిన పెరుగును, తరిగిన ఉల్లిపాయలను, ఉప్పు, మిరియాల పొడిని, తురిమిన బీట్రూట్‌ను వేసి కలుపుకోవాలి. బీట్రూట్ తురుము అరకప్పు వేసుకుంటే చాలు. ఈ మిశ్రమాన్ని డిన్నర్ టైంలో తినాలి. ఇది రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. దీనిలో కరిగే, కరగని ఫైబర్స్ ఉంటాయి. సులువుగా జీర్ణం అవడంతో పాటు బరువు త్వరగా తగ్గేలా చేస్తాయి.
ఆపిల్ పాలకూర సలాడ్
ఒక గిన్నెలో ఆపిల్‌ను సన్నగా తరగాలి. పాలకూరను కూడా సన్నగా తరిగి కలుపుకోవాలి. పావు కప్పు దానిమ్మ గింజలను, ఉల్లిపాయ తరుగు, ఉప్పు, మిరియాల పొడి, బాదం, పిస్తా వంటి గింజల తరుగును వేసి బాగా కలపాలి. ఇది రుచికరంగా ఉంటుంది. దీనిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అలాగే ఐరన్, మెగ్నీషియం, ఫొలేట్ కూడా అందుతుంది. కాబట్టి బరువు త్వరగా తగ్గుతారు. పోషకాహార లేమి కూడా రాదు.
పైన చెప్పిన సలాడ్లను నెలరోజుల పాటు తింటే చాలు. మీకే మీ బరువులో తేడా కనిపిస్తుంది. శరీరం తేలిగ్గా అనిపిస్తుంది. మూడు నెలల్లోనే బరువు తగ్గే అవకాశం ఉంటుంది.