Weight loss Flours: ఈ పిండ్లు రోజూ తింటే.. బరువు తగ్గడం మరింత సులభం..
Weight loss Flours: రోజూవారీ ఆహారంలో కొన్ని రకాల పిండ్లను చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడం సులభం. అవేంటో తెల్సుకోండి.
ఎత్తుకు తగిన బరువు ఉండటం అనేది ప్రతి ఒక్కరికీ అవసరమే. అలా దాన్ని నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉండగలం. అందుకనే చాలా మంది బరువు తగ్గడానికి చాలా కష్ట పడుతుంటారు. వ్యాయామాలు చేస్తారు. రకరకాల డైట్లు పాటిస్తూ ఉంటారు. ఇలా వెయిట్ లాస్ కోసం డైట్లను అనుసరించే వారికి పోషకాహార నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.. కొన్ని పిండ్లను డైట్‌లో భాగంగా చేర్చుకోవాలని అంటున్నారు. అప్పుడు వారికి బరువు తగ్గడం అనేది మరింత తేలిక అవుతుందని చెబుతున్నారు. మరి ఆ పిండ్లు ఏమిటో చూసేద్దాం.
రాగి పిండి :
గ్లూటెన్ అస్సలు లేని పిండ్లలో రాగి పిండి ఒకటి. దీనిలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. అలాగే అమీనో యాసిడ్లూ ఉంటాయి. అందువల్ల దీన్ని కొంచెం తిన్నా కడుపు నిండిపోయినట్లు ఉంటుంది. తర్వాత కూడా ఎక్కువ సేపటి వరకు ఆకలి వేయదు. దీన్ని జావలా గాని, చపాతీల్లాగాని, దోశల రూపంలో గాని తినవచ్చు. దీనిలో కాస్త గోధుమ పిండి లేదా జొన్నపిండి కలిపి రోటీలు చేసుకుని తినేయొచ్చు.
జొన్న పిండి :
ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువ మంది జొన్న పిండితో రొట్టెలు చేసుకుని తింటూ ఉంటారు. మిగిలిన వారు దీనిపై శ్రద్ధ పెట్టరు. అయితే బరువు తగ్గాలని అనుకునే వారు కూడా జొన్న పిండితో చేసిన వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనిలో పీచు పదార్థాలు, కాల్షియం, ఐరన్ లాంటి పోషకాలు ఉంటాయి. బీ విటమిన్‌లు, విటమిన్ సీ లాంటివీ ఉంటాయి. ఇవన్నీ జీర్ణ సమస్యలను తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి. తద్వారా జీవ క్రియ వేగవంతం అయి క్యాలరీలు ఎక్కువగా ఖర్చు కావడానికి ఆస్కారం ఉంటుంది.
సజ్జ పిండి :
బియ్యం, గోధులమల్లాంటి వాటిలో గ్లూటెన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అయితే సజ్జపిండిలో గ్లూటెన్ అనేది ఏ మాత్రమూ ఉండదు. ప్రొటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, పాస్ఫరస్ లాంటి ఖనిజాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఇవి శరీరానికి అధిక వేడి కలగకుండా కాపాడతాయి. బరువు తగ్గాలనుకునే ఆలోచనలో ఉన్న వారు అర కప్పు గోధుమ పిండి వాడుకుంటే మరో అరకప్పు వరకు సజ్జ పిండి కలుపుకుని చపాతీలు తయారు చేసుకోవచ్చు. కూర ఎక్కువ తిని రోటీలు తగ్గించి తినేందుకు ప్రయత్నిస్తే బరువు తేలికగా తగ్గుతారు.
బాదం పిండి :
బాదాం గింజలను తీసుకుని మిక్సీ పడితే వచ్చే దాన్నే బాదాం పిండి లేదా బాదం పౌడర్ అంటారు. మిక్సీలో వేసినప్పుడు ఎక్కువ సేపు ఉంచితే దీని నుంచి నూనె రావడం ప్రారంభం అవుతుంది. అందువల్ల అది మెత్తగా అయిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇది కాస్త మెత్తగా పొడిపొడిలాడుతూ ఉన్నప్పుడే మిక్సీని ఆపేయాలి. దీనిలో తక్కువ కార్బోహైడ్రేట్‌లు, ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయి. ఇది గ్లూటెన్ ఫ్రీ. తక్కువ తిన్నా ఎక్కువ పోషకాలు కావాలనుకున్నప్పుడు దీన్ని ఇష్టానుసారంగా వాడుకోవచ్చు. చాలా పదార్థాల్లో కొంతభాగం కలుపుకుని ఆహారంలో చేర్చుకోవచ్చు.