Warangal News : బడా బకాయిదారుల లిస్ట్ రెడీ, పన్ను కట్టని షాపులు సీజ్

 Warangal News : బడా బకాయిదారుల లిస్ట్ రెడీ, పన్ను కట్టని షాపులు సీజ్

Warangal News : గ్రేటర్ వరంగల్ పరిధిలో పన్ను వసూళ్లపై అధికారులు దృష్టిపెట్టారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా ఇంకా సగం పన్నులు కూడా వసూలు కాకపోవడంతో.. బడా బకాయిదారుల లిస్ట్ రెడీ చేస్తున్నారు అధికారులు. మొండి బకాయిదారుల షాపులు సీజ్ చేసేందుకు డిసైడ్ అయ్యారు.

షాపు సీజ్ చేస్తున్న అధికారులు

షాపు సీజ్ చేస్తున్న అధికారులు

Warangal News : గ్రేటర్ వరంగల్ పరిధిలో ట్యాక్స్ వసూళ్లపై బల్దియా ఫోకస్ పెట్టింది. ఇంకో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా.. ఇంతవరకు సగం కూడా పన్ను వసూలు పూర్తి కాలేదు. దీంతో ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా పన్నులు క్లియర్ చేయించేలా బల్దియా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు బకాయిలు పేరుకుపోయిన బడా దుకాణదారుల సమాచారాన్ని తయారు చేయించి, ముందుగా వారిపై యాక్షన్ తీసుకునేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. అంతేగాకుండా ఏళ్లుగా ట్యాక్స్ లు కట్టని వాళ్లపై చర్యలకు సిద్ధమయ్యార

రెండేళ్లుగా పెండింగ్.. షాప్ సీజ్

పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టిన అధికారులు ముందుగా మొండి బకాయిల లిస్ట్ రెడీ చేశారు. ఏళ్ల తరబడి ట్యాక్స్ కట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నవారికి ముందుగా నోటీసులు జారీ చేసి, అయినా స్పందించని పక్షంలో కఠిన చర్యలు చేపట్టేలా యాక్షన్ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే బుధవారం వరంగల్ నగరంలోని ఓ షాప్ ను సీజ్ చేశారు. లష్కర్ బజార్ కు చెందిన ఇండియన్ టెర్రయిన్ అనే షాప్ నిర్వాహకులు రెండేళ్లుగా పన్ను చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వసూలు కోసం వెళ్లిన సిబ్బందికి ఏదో ఒక సాకు చెబుతూ తప్పించుకుంటున్నారు. ఈ మేరకు షాప్ కు సంబంధించిన రెండు సంవత్సాల ట్యాక్స్ పెండింగ్ లో పడింది. ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల కిందట బల్దియా సిబ్బంది మరోసారి సంబంధిత యజమానులను సంప్రదించారు. స్పందన లేకపోవడంతో నోటీసులు జారీ చేసి, పన్నులు చెల్లించాలని కోరారు. ఆ తరువాత కూడా వారి నుంచి సరైన సమాధానం లేకపోవడంతో రెడ్ నోటీస్ కూడా జారీ చేశారు. అయినా కూడా ఫలితం లేకపోవడంతో విషయాన్ని గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన ఆదేశాల మేరకు మున్సిపల్ యాక్ట్–2019 ప్రకారం ఇండియన్ టెర్రయిన్ షాప్ నకు రూ.80,448 పెనాల్టీ విధించడమే కాకుండా అధికారుల ఆదేశాలను బేఖాతరు చేయడంతో షాప్ ను సీజ్ చేశారు. సకాలంలో పన్నులు చెల్లించకపోతే మున్సిపల్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా హెచ్చరించారు.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ.100.92 కోట్ల పన్ను వసూలు లక్ష్యం కాగా.. రూ.44.5 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పన్ను వసూళ్లకు అడ్డంకులు ఏర్పడటంతో ఇంకా సగానికిపైగా పెండింగ్ లోనే ఉన్నాయి. దీంతో వాటిని సకాలంలో వసూలు చేయడం అధికారులకు సవాల్ గా మారింది. ఇంత తక్కువ సమయంలో పన్ను వసూలు టార్గెట్ రీచ్ అయ్యేందుకు అధికారులు ప్లాన్ రెడీ చేశారు. ఈ మేరకు బిల్ కలెక్టర్లు, ఆర్ఐలకు రోజువారీ పన్నుల సేకరణ లక్ష్యాన్ని విధించారు. పురోగతి సాధించని పక్షంలో సిబ్బందిపైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతిరోజు పన్నుల సేకరణను రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు పర్యవేక్షించాల్సిందిగా సూచించారు. దీంతో గ్రేటర్ వరంగల్ పరిధిలోని రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి మ్యుటేషన్ అయిన, కొత్త గృహాలను గుర్తించి అసెస్మెంట్, రివైజ్డ్ ట్యాక్స్ విధిస్తున్నారు. కమర్షియల్ ఫంక్షన్ హాల్స్, రెసిడెన్సియల్ నుంచి కమర్షియల్ గా మార్పు చెందినవాటిపైనా దృష్టి పెట్టా బల్దియా ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా పన్నుల టార్గెట్ రీచ్ అయ్యేందుకు ముందుగా బడా బకాయిదారులపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు వారందరికీ నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు అధికారులు బడా బకాయి దారుల లిస్ట్ రెడీ చేసి, పన్నులు క్లియర్ చేయించే పనిలో పడ్డారు. కాగా ఇంకో రెండు నెలల్లోనే ఆర్థిక సంవత్సరం ముగియనుండగా.. ఆఫీసర్లు అనుకున్న మేర టార్గెట్ రీచ్ అవుతారో లేదో చూడాలి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *