Uttam Kumar Reddy : సీఎం అభ్యర్థిగా ఎవరి పేరు ప్రకటించినా ఆమోదమే, ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

 Uttam Kumar Reddy : సీఎం అభ్యర్థిగా ఎవరి పేరు ప్రకటించినా ఆమోదమే, ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Uttam Kumar Reddy : తెలంగాణ సీఎం అభ్యర్థిగా ఎవరి పేరు ప్రకటించినా తనకు ఆమోదమేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హస్తిన పర్యటనలో ఉన్న ఉత్తమ్ కాంగ్రెస్ అగ్రనేతలను కలుస్తున్నారు.

Uttam Kumar Reddy : తెలంగాణ సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం సీఎం ఖరారుపై చర్చిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఈ విషయంపై చర్చించారు. డీకే శివకుమార్ కూడా దిల్లీలో అగ్రనేతలతో భేటీ అయ్యారు. అయితే సీఎం అభ్యర్థిగా ఎవరి పేరు అధిష్టానం ప్రకటించినా తనకు అభ్యంతరం లేదని ఆ పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దిల్లీ వెళ్లిన ఆయన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. డీకే శివకుమార్‌తో భేటీ అనంతరం ఉత్తమ్‌ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… సీఎం అభ్యర్థిని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఖరారు చేస్తారని చెప్పారు.

ఎంపీ పదవికి రాజీనామా?

మాజీ పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవలే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు. ఇవాళ దిల్లీ వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి….. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్థుల ఎంపికపై వీరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది.

మరోవైపు కాంగ్రెస్ నుంచి సీఎం రేసులో ఉన్న ఆయన హఠాత్తుగా దిల్లీకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్రానికి కాబోయే సీఎం ఎవరన్నా ఉత్కంఠ అందరిలోనూ నెలకొని ఉండగా…..ఈరోజు సాయంత్రం అభ్యర్థి పేరు ఫైనల్ చేస్తామని ఖర్గే స్పష్టం చేశారు. దీంతో సీఎం అభ్యర్థి పై సస్పెన్స్ వీడనుంది.

ఉత్తమ్ హస్తిన పర్యటనపై ఉత్కంఠ

రెండు రోజుల క్రితం వెలువడిన తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాను హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా హుజూర్ నగర్ శాసన సభకు ప్రతినిత్యం వహిస్తానని, నల్గొండ లోక్ సభ స్థానానికి రాజీనామా చేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఉత్తమ్ తో పాటు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న రేవంత్, కోమటిరెడ్డి కూడా తమ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే రేవంత్, కోమటిరెడ్డి ఎప్పుడు చేస్తారో మాత్రం తెలియాల్సి ఉంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *