TSRTC : టీఎస్ఆర్టీసీ రికార్డ్, ఒక్క రోజే 52.78 లక్షల మంది ప్రయాణం

 TSRTC : టీఎస్ఆర్టీసీ రికార్డ్, ఒక్క రోజే 52.78 లక్షల మంది ప్రయాణం

TSRTC : సంక్రాంతి రద్దీ దృష్ట్యా శనివారం ఒక్కరోజే టీఎస్ఆర్టీసీ 1861 ప్రత్యేక బస్సులు నడిపినట్లు సజ్జనార్ తెలిపారు. నిన్న ఒక్కరోజే 52.78 లక్షల ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని తెలిపారు.

టీఎస్ఆర్టీసీ

టీఎస్ఆర్టీసీ

TSRTC : సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) బస్సులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో శనివారం ఒక్క రోజే 1861 ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాలకు సంస్థ నడిపిందన్నారు. అందులో 1127 హైదరాబాద్‌ నగర బస్సులను ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న కరీంనగర్‌, వరంగల్, విజయవాడ, ఖమ్మం రూట్లలో నడిపామన్నారు. సంక్రాంతి సందర్బంగా 4484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని సంస్థ ప్లాన్‌ చేయగా….ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉండటంతో ఈ నెల 11, 12, 13 తేదీల్లోనే 4400 ప్రత్యేక బస్సులను నడపగా…..శనివారం వరకు మొత్తంగా 6261 ప్రత్యేక బస్సులను నడిపామన్నారు. ఆదివారం కూడా 652 ప్రత్యేక బస్సులను ప్లాన్ చేయగా… మధ్యాహ్నం వరకు 450 బస్సులను సంస్థ అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు.

శనివారం ఒక్క రోజులోనే 52.78 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు ఆర్టీసీ సిబ్బంది చేర్చారని సజ్జనార్ తెలిపారు.అందులో సగానికిపైగా మహిళా ప్రయాణికులే ఉన్నారు. మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకుని ఉచితంగా వారంతా సొంతూళ్లకు వెళ్లారు. ముందస్తు ప్రణాళికతో పాటు సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల సంక్రాంతికి ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ప్రయాణికులను తమ సొంతూళ్లకు సంస్థ చేర్చింది. తొలిసారిగా బస్‌ భవన్‌ లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేసి…రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ప్రయాణికులు అందుబాటులో ఉంచామన్నారు. సంక్రాంతికి ప్రశాంతంగా ప్రజలను సొంతూళ్లకు చేర్చడంలో పాలుపంచుకున్న టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది, అధికారులకు సజ్జనార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు.

నగరంలో కొత్తగా 36 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీఎస్ఆర్టీసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌ లోని ప్రధాన రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీరు, హెల్ప్ డెస్క్, మొబైల్ టాయిలెట్ల సుదుపాయం కల్పించింది. నగరంలోని ప్రధాన ట్రాఫిక్‌ జనరేటింగ్‌ పాయింట్లైన ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌ లలో కొత్తగా 36 సీసీటీవీ కెమెరాలను ఆర్టీసీ సంస్థ ఏర్పాటు చేసింది. వాటిని బస్‌ భవన్‌ లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ కు అనుసంధానం చేసింది. ఈ సీసీటీవీ కెమెరాల ద్వారా ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతున్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *