TS Schools Ragi Java : ప్రభుత్వ పాఠశాలల్లో ఈవెనింగ్ మీల్, విద్యార్థులకు రాగి జావ పంపిణీ
TS Schools Ragi Java : తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపు కబురు అందించింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం రాగి జావను పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ఇటీవలే దసరా కానుకగా ప్రభుత్వం విద్యార్థులకు అల్పాహార పథకాన్ని ప్రారంభించింది. అయితే విద్యార్థుల్లో రక్తహీనతను నివారించడమే లక్ష్యంగా ” అల్పాహార పథకం ” , ” రాగి జావ ” కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ప్రతీ రోజు విద్యార్థులు ఉదయం పాఠశాలకు వచ్చి అల్పాహారం అందిస్తారు. సాయంత్రం పోష్టికాహరంగా ఈ రాగి జావను అందిస్తారు. అయితే ఈ రాగి జావ వారంలో మూడు రోజులు అందించనున్నారు. అయితే ఈనెల 26తో దసరా సెలవులు ముగుస్తాయి. 27 లేదా 28 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు సమాచారం.
23 లక్షల విద్యార్థులకు లబ్ది
ఇప్పటికే రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అల్పాహారం మెనూలో ఇడ్లీ, ఉప్మా, పూరీ, మిల్లెట్ ఇడ్లీ అందించడంతో పాటు పోహా, పొంగల్, వెజిటబుల్ పులావ్ , కిచ్డీ కూడా అందిస్తున్నారు. ఈ పథకం కింద మొత్తం 27,147 ప్రభుత్వ పాఠశాలల్లోని 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. వీటితో పాటు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. పప్పు, సాంబార్, వెజిటబుల్ కర్రీ, లెగ్యూమ్ వెజిటబుల్ కర్రీ , వెజిటబుల్ బిర్యానీ, బగరా రైస్, పులిహోర వంటి ప్రత్యేక మెనూతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. విద్యార్థులకు వారానికి మూడుసార్లు గుడ్డు కూడా అందజేస్తున్నారు. కాగా 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో పంచుకుంటే 1 నుంచి 10 వ తరగతి విద్యార్ధులకు కోడిగుడ్లు,9, 10 వ తరగతి విద్యార్ధులకు మధ్యాహ్నం భోజనం ఖర్చు మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.