Trolling on Sharmila: పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల… తీవ్ర స్థాయిలో ట్రోలింగ్
Trolling on Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్.షర్మిల బాధ్యతలు స్వీకరించిన గంటల వ్యవధిలోనే ఆమెపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తు దాడి మొదలైంది.

Trolling on Sharmila: పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల అలా బాధ్యతలు స్వీకరించారో లేదో ఆమెపై పెద్ద ఎత్తున సోషల్ మీడియా ట్రోలింగ్ మొదలైంది. వైఎస్.షర్మిల పేరును రకరకాలుగా మారుస్తూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. తొలి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అని షర్మిల సంబోధించడంతో వైసీపీ శ్రేణులు చెలరేగిపోయాయి. షర్మిలను రకరకాలుగా దూషిస్తూ ట్రోల్ చేయడం ప్రారంభించారు.
నిన్న మొన్నటి వరకు వైఎస్ షర్మిల పేరుపై రాని అభ్యంతరాలు ఒక్కరోజులోనే మారిపోవడం అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. షర్మిల ఇకపై భర్త ఇంటి పేరును వాడుకోవాలని, వైఎస్ కుటుంబంతో ఆమెకు సంబంధం లేదంటూ రకరకాల వ్యాఖ్యానాలు, కామెంట్లు వెలువడ్డాయి.
వైసీపీలో ఉన్న ద్వితియ శ్రేణి నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు ఆమెను దూషించడానికి పోటీలు పడ్డారు. షర్మిల దాదాపు 12ఏళ్లుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లిన సమయంలో ఆయన తరపున వేల కిలోమీటర్ల పాదయాత్రలు నిర్వహించారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఏపీలో వైసీపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోదరుడితో తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఆమె తెలంగాణ సొంత పార్టీ పెట్టుకున్నారు. దాదాపు రెండేళ్ల పాటు ఆ పార్టీ తరపున తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీయడం ఇష్టం లేక పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
షర్మిల బాధ్యతలు స్వీకరించిన వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని, అభివృద్ధి లేదని మండిపడ్డారు.తన ప్రసంగంలో రెండు మూడు సార్లు జగన్ రెడ్డి అంటూ సోదరుడిని నిలదీశారు.
రాaraష్ట్రంలో అభివృద్ధి లేమి, రాజధాని నిర్మాణం, మణిపూర్ అల్లర్లలో క్రైస్తువులు ప్రాణాలు కోల్పోవడం వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. మున్ముందు తన రాజకీయ లక్ష్యం జగన్ మోహన్ రెడ్డేనని తొలి ప్రసంగంలోనే స్పష్టతనిచ్చారు. దీంతో వైసీపీ శ్రేణులు ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది