TREIRB Results: టీఎస్ గురుకులాల్లో 9210 ఉద్యోగాల భర్తీకి లైన్‌క్లియర్.. ఈనెల 28, 29 తేదీల్లో..
TREIRB Telangana Teacher Results 2023 : తెలంగాణలో గురుకుల ఉద్యోగ నియామక ప్రక్రియలో కొంత కదలిక కనిపిస్తోంది. టీఆర్‌ఈఐఆర్‌బీ త్వరలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.
TREIRB Gurukulam Results 2023 : తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో 9210 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ కొంత కదలిక వచ్చింది. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (TREIRB).. గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మరో అడుగు ముందుకు వేసింది . 9210 ఉద్యోగాలకు సంబంధించి అర్హత పరీక్షలను నిర్వహించిన.. TREIRB మూడు కేటగిరీల్లో మినహా మిగతా అన్ని పరీక్షల తాలుకూ ప్రశ్నాపత్రాల ‘కీ’ లను సైతం విడుదల చేసింది.
అయితే.. మహిళా రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉండడంతో నియామకాల ప్రక్రియలో కొంత గందరగోళం ఏర్పడింది. ప్రస్తుతం నియామకాల ప్రక్రియను తుది దశకు తీసుకువచ్చే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అతి త్వరలో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు ఏర్పాట్లు చేస్తున్నారు. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి జిల్లాల వారీగా ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేందుకు ఇప్పటికే TREIRB బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ధ్రువపత్రాల పరిశీలనను అత్యంత జాగ్రత్తగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించింది.
అధికారులకు ధ్రువపత్రాల పరిశీలనపై ముందుగా శిక్షణ ఇవ్వాలని కూడా నిర్ణయించింది. ఈ క్రమంలో పరిశీలనాధికారులకు డిసెంబర్ 28, 29 తేదీల్లో ఎల్బీనగర్లోని గురుకుల కాలేజీల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. రెండు రోజుల శిక్షణలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనపై అవగాహన కల్పిస్తారు. మరోవైపు మహిళా రిజర్వేషన్లు, ఒకట్రెండు కేటగిరీల్లోని ఉద్యోగాల విషయంలోని అంశాలు కోర్డు పరిధిలో ఉండగా.. వీటిపై కూడా త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో జనవరి రెండో వారం నాటికి 1:2 జాబితా విడుదల చేసి.. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ గురుకులాల్లోని డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీల్లో లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్లు, పీజీ టీచర్లు, గ్రాడ్యుయేట్ టీచర్ తదితర 9,026 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో గురుకుల ఉద్యోగ పరీక్షలను ఆగస్టు 1నుంచి ఆగస్టు 23వ తేదీ వరకు నిర్వహించారు.