Tofu Scramble: అయిదు నిమిషాల్లో రెడీ అయ్యే అల్పాహారం.. టోఫు స్క్రాంబుల్..
Tofu Scramble: ఉదయం ప్రొటీన్ ఎక్కువగా ఉండే అల్పాహారం తినాలనుకుంటే టోఫు స్క్రాంబుల్ ప్రయత్నించండి. చాలా కొత్తగా అనిపిస్తుంది. తయారీ కూడా సులభమే.
ఉదయన్నే ప్రొటీన్ ఎక్కువగా ఉండే అల్పాహారం తినాలనుకుంటే టోఫు మంచి ఎంపిక. టోఫును ఎక్కువగా వండకుండా కొద్దిగా నూనె వాడి చేసే టోఫు స్క్రాంబుల్ ను బ్రౌన్ బ్రెడ్ తో సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలకు కూడా కాస్త ఫ్యాన్సీగా, కొత్త అల్పాహారం తిన్నట్టుంటుంది. అదెలా చేయాలో చూసి చేసేయండి.
కావాల్సిన పదార్థాలు:
పావు కేజీ టోఫు
1 చెంచా ఆలివ్ నూనె
1 ఉల్లిపాయ, సన్నని తరుగు
2 వెల్లుల్లి రెబ్బలు, తరుగు
పావు చెంచా పసుపు
సగం చెంచా జీలకర్ర పొడి
సగం చెంచా కారం లేదా మిరియాల పొడి
సగం కప్పు చెర్రీ టమాటాలు
కొద్దిగా కొత్తిమీర, తరుగు
బ్రెడ్ స్లైసులు
తయారీ విధానం:
- ముందుగా బ్రెడ్ కి బటర్ రాసుకుని పెనం మీద కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఒక ప్యాన్ పెట్టుకుని ఆలివ్ నూనె వేసుకుని వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.
- అందులోనే వెల్లుల్లి ముక్కలు, పసుపు, జీలకర్ర పొడి, కారం కూడా వేసుకుని ఒక నిమిషం పాటూ సన్నం మంట మీద వేగనివ్వాలి.
- ఇప్పుడు ఒక గిన్నెలో టోఫును ఫోర్క్ సాయంతో మెదుపుకోవాలి. మధ్య మధ్యలో కొన్ని ముక్కలు అలాగే ఉండేలా చూసుకోవాలి.
- ఈ టోఫును తాలింపు పెట్టుకున్న ప్యాన్ లో వేసుకుని కలుపుకోవాలి. కాస్త ఉప్పు కూడా చల్లుకుని బాగా కలిసేలా కలుపుకోవాలి. దీన్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి.
- అదే ప్యాన్ లో కొద్దిగా నూనె వేసుకుని చెర్రీ టమాటాలను సగం ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. అవి కాస్త మెత్తబడ్డాక టోఫు మిశ్రమంలో కలిపేసుకోవాలి.
- కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకుని, ముందుగా టోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ తో సర్వ్ చేసుకుంటే చాలు. టోఫు స్క్రాంబుల్ రెడీ.