Tirumala: తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు.. నిండిపోయిన 31 కంపార్ట్‌మెంట్‌లు

 Tirumala: తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు.. నిండిపోయిన 31 కంపార్ట్‌మెంట్‌లు

వేసవి సెలవులు మరికొన్ని రోజుల్లో ముగుస్తుండటంతో పాటు వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వారంతపు సెలవుదినాలు కావడంతో శ్రీవారి ఆలయ పరిసరాలతో పాటు తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో యాత్రికుల సందడి నెలకొంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి..

Tirumala: తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు.. నిండిపోయిన 31 కంపార్ట్‌మెంట్‌లు
 

వేసవి సెలవులు ముగిసి మరో నాలుగురోజుల్లో పాఠశాలలు ప్రారంభంకానుండటంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమల కొండపై ఎటుచూసిన భక్త జన సందోహమే కన్పిస్తోంది. శని, ఆదివారాలు సెలవుదినాలు కావడంతో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో ఉన్న 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లలో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతోందని టీటీడీ అధికారులు వివరించారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు దర్శనానికి 6 గంటలు పడుతోంది. కల్యాణకట్టలు, లడ్డూ కేంద్రం, అఖిలాండం, అన్నప్రసాద భవనాలూ రద్దీగా మారాయి. గదులకు డిమాండ్‌ మరింత పెరిగిపోయింది. గదులు పొందేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరాల్సి వచ్చింది. సీఆర్వో ప్రాంతమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. అలాగే అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

స్లాటెడ్‌ సర్వదర్శన టోకెన్లు జారీ చేసే భూదేవి కాంప్లెక్స్‌, శ్రీనివాసం, విష్ణు నివాసం కూడా రద్దీగా మారాయి. నిన్న స్వామివారిని 88వేల2వందల57 మంది భక్తులు దర్శించుకోగా 45వేల068 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల రూపేణ శ్రీవారి హుండీకి రూ.3.68 కోట్లు వచ్చాయని తెలిపారు. ఈనెల 9 నుంచి 11వతేదీవరకు తిరుమలలో శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్ఠాభిషేకం జరుగనుంది. ఏటా జ్యేష్ఠమాసంలో మూడురోజుల‌ పాటు తిరుమల‌ శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహించనున్నారు. మొదటి రోజున శ్రీ మలయప్ప స్వామివారి బంగారు కవచాన్ని తొలగించి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నానం, తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారు. రెండో రోజు ముత్యాల కవచంతో స్వామిని అలంకరిస్తారు. మూడోరోజు తిరుమంజనాదులు పూర్తిచేసి తిరిగి బంగారు కవచాన్ని సమర్పిస్తారు. జ్యేష్ఠాభిషేకం సందర్భంగా తిరుమలకు భక్తుల రాక మరింత పెరుగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *