TG Crime: నిమ్స్ ఆస్పత్రి బాత్‌రూమ్ దగ్గర పసికందు మృతదేహం కలకలం

హైదరాబాద్‌లోని పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రి బాత్‌రూమ్ సమీపంలో పసికందు మృతదేహం కలకలం రేపింది. ఓపీ బిల్డింగ్‌లోని మహిళల టాయిలెట్‌లో ఈ దారుణం బయట పడింది. అప్పుడే పుట్టిన శిశువును మ్యాన్‌హోల్‌లో పడేసినట్లు అనుమానిస్తున్నారు
TG Crime: హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ప్రభుత్వ వైద్య సేవా కేంద్రమైన నిమ్స్ ఆసుపత్రిలో ఓ హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రి ఓపీ బిల్డింగ్‌లోని మహిళల టాయిలెట్ ప్రాంతంలో పసికందు మృతదేహం లభ్యమైంది. బుధవారం ఉదయం పారిశుద్ధ్య సిబ్బంది శుభ్రత పనులు చేస్తుండగా ఈ ఘటన గమనించారు. టాయిలెట్‌లో నీరు నిలిచిపోవడం గమనించి.. సమస్య ఏంటో తెలుసుకునేందుకు వారు మ్యాన్‌హోల్ తెరిచిన చూడగా.. అందులో పసికందు శవం కనిపించింది.
ఈ దృశ్యం చూసిన సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం నిమ్స్ ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. శిశువు మహిళల బాత్‌రూమ్‌కు అతి సమీపంలో ఉన్న మ్యాన్‌హోల్‌లో పడేసినట్లు అనుమానిస్తున్నారు. ఇంతటి దారుణానికి పాల్పడింది ఎవరని పోలీసులు ఆరా తీస్తున్నారు.
పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తూ.. గత కొన్ని రోజులుగా ఆసుపత్రికి వచ్చిన వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ప్రతి చిన్న వివరాన్ని అన్వేషిస్తూ విచారణను వేగవంతం చేశారు. నిమ్స్ ఆసుపత్రిలో చిన్న పిల్లల జననానికి సంబంధించిన విభాగం, మాతృశిశు సంరక్షణ విభాగాల్లో పరిశీలన చేస్తున్నారు. ఈ సంఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ పసికందును ఇలా విడిచిపెట్టి వెళ్లటంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని అంటున్నారు. నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.