Telangana Elections 2023 : అక్టోబరు 3న తెలంగాణకు కేంద్రం ఎన్నికల బృందం – సీఎస్ కీలక ఆదేశాలు

 Telangana Elections 2023 : అక్టోబరు 3న తెలంగాణకు కేంద్రం ఎన్నికల బృందం – సీఎస్ కీలక ఆదేశాలు

Election Commission of India :అక్టోబర్ 3, 4, 5 తేదీల్లో తెలంగాణలో పర్యటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈసీఐ పర్యటన నేపథ్యంలో సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎస్ శాంతి కుమారి సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Election Commission of India: త్వరలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రాథమికంగా తేదీలను ఖరారు చేయగా… రాష్ట్రంలోని అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా… అక్టోబరు 3వ తేదీన తెలంగాణలో పర్యటించనుంది కేంద్ర ఎన్నికల సంఘ బృందం. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో భేటీ కానుంది. ఎన్నికల ఏర్పాట్లుపై చర్చించటంతో పాటు పలు అంశాలపై దిశానిర్దేశం చేయనుంది.

సీఎస్ సమీక్ష…
రాష్ట్రంలో అక్టోబర్ 3న ఎలక్షన్ కమిషన్ అధికారుల పర్యటన సందర్భంగా అధికారులు అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. ఈసీ అధికారుల రాష్ట్ర పర్యటనకు సంబంధించి చేసిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు కేంద్ర ఎన్నికల సంఘంకు చెందిన ఇతర సభ్యులు వచ్చే నెల 3 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోనే పర్యటిస్తారు. EC సభ్యులు తమ మూడు రోజుల పర్యటనలో ఎన్‌ఫోర్స్‌ మెంట్ ఏజెన్సీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు/సీపీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారని సి.ఎస్ అధికారులకు తెలిపారు.

ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నందున ఎన్నికలకు సంబంధించిన అంశాలపై క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని, అధికారులు అన్ని వివరాలను ఒకే పద్ధతిలో అందించాలని ఆమె అన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో కనీస సౌకర్యాల వివరాలను అందించాలని, వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్లతో చర్చించి వీల్ చైర్ లు కొనుగోలు చేసి పోలింగ్ కేంద్రాల వద్ద ఉంచాలన్నారు. ఏఈఆర్‌ఓ/ఈఆర్‌ఓల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, సమీకృత సరిహద్దు చెక్‌పోస్టుల వివరాలను కూడా ఈసీ అధికారులకు అందుబాటులో ఉంచాలని ఆమె తెలిపారు.

ఈ సమావేశంలో సీఈవో వికాస్ రాజ్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హోం శాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, విద్యాశాఖ కార్యదర్శి వీ కరుణ, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి భారతి హోళికేరి, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అశోక్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *