Sania Mirza: సానియా మీర్జా విడాకులపై స్పందించిన సోదరి ఆనమ్.. చెప్పాల్సిన అవసరం వచ్చిందంటూ..
Sania Mirza: పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకున్నాడు. దీంతో సానియా మీర్జాతో అతడికి విడాకులు అయ్యాయా అనే విషయంలో సందిగ్ధత ఏర్పడింది. దీంతో ఈ విషయంపై సానియా సోదరి ఆనమ్ మీర్జా క్లారిటీ ఇచ్చారు.

Sania Mirza: పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్‍తో సానియా మీర్జా విడాకుల అంశంపై ఆమె సోదరి ఆనమ్ మీర్జా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా నేడు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్.. మరో పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ సినీ నటి సనా జావేద్‍ను తాను వివాహం చేసుకున్నట్టు శనివారం (జనవరి 20) ప్రకటించాడు మాలిక్. దీంతో సానియాతో మాలిక్ విడాకుల ప్రక్రియ పూర్తయిందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో నేడు (జనవరి 21) ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జా.
“తన వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ దృష్టి నుంచి ఎప్పుడూ దూరంగానే ఉంచుతూ వచ్చారు సానియా. అయితే, కొన్ని నెలల క్రితమే మాలిక్, ఆమె (సానియా మీర్జా) విడాకులు తీసుకున్నారని ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. కొత్త జర్నీ మొదలుపెట్టిన షోయబ్‍కు ఆమె విషెస్ చెప్పారు. జీవితంలో సెన్సిటివ్ కాలాన్ని ఆమె ఎదుర్కొంటున్న తరుణంలో.. ఎవరూ ఎలాంటి పుకార్లు వ్యాప్తి చేయవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆమెకు కావాల్సిన ప్రైవసీని గౌరవించండి” అని మీర్జా కుటుంబం, టీమ్ సానియా పేరుతో ఆనమ్ మీర్జా ఓ లేఖ పోస్ట్ చేశారు.
కాగా, షోయబ్ మాలిక్‍కు సానియా మీర్జా ఖులా ఇచ్చారని ఆమె తండ్రి ఇమామ్ మీర్జా వెల్లడించారు. అంటే, మాలిక్ నుంచి విడిపోవాలని సానియా మీర్జానే ముందుగా నిశ్చయించుకున్నారని చెప్పేశారు.