Revanth Reddy : రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్, పెట్టుబడి సాయం విడుదలకు ఆదేశాలు

 Revanth Reddy : రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్, పెట్టుబడి సాయం విడుదలకు ఆదేశాలు

Revanth Reddy : రైతులకు పెట్టుబడి సాయం నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతు భరోసా స్కీమ్ విధివిధానాలు ఖరారు కాలేదని, గతంలో మాదిరి రైతు బంధు చెల్లింపులు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు పెట్టుబడి సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధుల విడుదల చేయాలని ఆదేశాలు జారీచేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలో ఇచ్చిన రైతు భరోసా పథకానికి ఇంకా విధివిధానాలు ఖరారు కాలేదని, దీంతో గతంలో మాదిరి రైతు బంధు చెల్లింపులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతులకు వెంటనే చెల్లింపులు ప్రారంభించాలని సూచించారు.

సీఎం సమీక్ష

రాష్ట్రంలోని రైతులందరికీ ‘రైతుబంధు’ నిధులను వారి ఖాతాల్లో జమచేసే ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో దాదాపు మూడు గంటల పాటు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ, సంబంధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… రైతులకు నేటి నుంచే ‘రైతుబంధు’ నిధులను వారి ఖాతాల్లో వేసే ప్రక్రియను ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలుగకుండా పంట పెట్టుబడి సహాయం అందించాలని అన్నారు.

రుణమాఫీపై కార్యాచరణ

తెలంగాణ ఎన్నికలకు ముందు రైతు బంధు సాయం అందించాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా రైతు బంధు నిధుల విడుదల నిలిచిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామని రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ తాజాగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో రైతుల అకౌంట్లలో పెట్టుబడి సాయం జమచేసేందుకు అధికారులు సమాయత్తం అయ్యారు. మరోవైపు రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ విషయంలో కార్యాచరణ ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

చెల్లింపులు ప్రారంభం

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.10 వేలు అందించింది. ఏడాదిలో రెండు విడుతల్లో ఈ ఆర్థిక సాయాన్ని రైతులకు అందిస్తుండగా.. అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ కారణంగా రబీ సీజన్‌కు రైతుల ఖాతాల్లో నగదు జమ నిలిచిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ప్రతిపాదనలకు ముందు ఈసీ ఆమోదం తెలిపింది. నిధుల దీంతో ట్రెజ‌రీలో రైతు బంధు నిధుల‌ను అప్పటి ప్రభుత్వం జ‌మ చేసింది. అయితే నిబంధనలు ఉల్లఘించిన కారణంగా ఈసీ నిధుల విడుదలను అడ్డుకుంది. తాజాగా ట్రెజ‌రీలో జ‌మ చేసిన నిధుల‌ను విడుద‌ల చేయాల‌ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రైతుల ఖాతాల్లోకి చెల్లింపులు ప్రారంభం అయ్యాయి.

ప్రతీ మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి

ప్రస్తుతం ‘జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్’లో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ను ఇక నుంచి ‘ప్రజావాణి’గా పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ ‘ప్రజావాణి’ని ఇక నుంచి ప్రతీ మంగళ, శుక్రవారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ ప్రజావాణికి ఉదయం 10 గంటలలోపు జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్ కు చేరుకున్న వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుచేయాలని, ప్రజల సౌకర్యార్థం తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *