Praja Palana Applications : అలర్ట్… ఇవాళే ‘ప్రజా పాలన’ దరఖాస్తులకు లాస్ట్ డేట్ – కోటి దాటిన అప్లికేషన్లు

 Praja Palana Applications : అలర్ట్… ఇవాళే ‘ప్రజా పాలన’ దరఖాస్తులకు లాస్ట్ డేట్ – కోటి దాటిన అప్లికేషన్లు

TS Govt Praja Palana Applications : ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తులు కోటికి పైగా దాటినట్లు అధికారులు చెబుతున్నారు. ఇవాళ ఆఖరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.

ప్రజా పాలన దరఖాస్తులు

ప్రజా పాలన దరఖాస్తులు

TS Govt Praja Palana Applications : తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన ‘ప్రజా పాలన’ కార్యక్రమం ఇవాళ్టితో ముగియనుంది. అభయహస్తం పేరిట పలు పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తోంది ప్రభుత్వం. డిసెంబర్ 28 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం…. జనవరి 6 వరకు కొనసాగనుంది. తుది గడువు ఇవాళ్టి పూర్తి కానుండటంతో దరఖాస్తు చేసుకోని వారు వెంటనే అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

కోటి దాటిన అప్లికేషన్లు….

కీలకమైన పథకాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తుండటంతో అప్లికేషన్లు భారీగా వస్తున్నాయి. ఇప్పటి వరకు కోటికి పైగా దరఖాస్తులు దాటాయి. శుక్రవారం నాటికి 1,08,94,115 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెప్పారు. ఇక శనివారం (ఇవాళ)తో గడువు ముగియనున్న నేపథ్యంలో…. భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. చివరి రోజు తాకిడి ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న అధికారులు… ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా… తగిన ఏర్పాట్లు చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు. ప్రత్యేకంగా మరిన్ని కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

గడువు పెంపు ఉండదు…!

ఇవాళ్టితో గడువు ముగుస్తున్న నేపథ్యంలో…. మరింత సమయం పెంచే అవకాశం ఉంటుందా అని పలువురు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే పలువురు మంత్రులు దీనిపై కీలక ప్రకటన చేశారు. ఆరో తేదీ వరకే దరఖాస్తులను స్వీకరిస్తామని… గడువు పెంచే అవకాశం లేదని చెప్పారు. అయితే ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రభుత్వవర్గాలు కూడా స్పష్టం చేశారు. జనవరి 6వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని.. ప్రస్తుతానికి గడువు పొడిగించే ప్రసక్తే లేదని వెల్లడించాయి. అయితే ఇప్పుడు దరఖాస్తు చేసుకోలేని వారు… మళ్లీ నాలుగు నెలల తర్వాత చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీ లను ఈనెల 17 వతేదీ వరకు పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎస్ శాంతి కుమారి. ఈనెల 6వ తేదీన ప్రజాపాలన ముగిసిన వెంటనే అందిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినందున… దరఖాస్తు ఇవ్వని వారు, మరోసారి తిరిగి దారఖాస్తులు అందచేయవచ్చని తెలియజేశారు.

ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా… ముఖ్యంగా ఐదు పథకాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందులో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత, యువ వికాసం పథకాలున్నాయి. ప్రతి పథకానికి వేర్వేరుగా దరఖాస్తు చేసుకోనవసరం లేకుండా.. ఏ పథకానికి అర్హులైనవారు ఆ పథకానికి అవసరమైన వివరాలు మాత్రమే దరఖాస్తు ఫారంలో నింపాల్సి ఉంటుంది. ఒకే ఫారమ్ లో అన్ని పథకాలకు సంబంధించిన కాలమ్స్ ఇచ్చారు.దరఖాస్తు ఫారమ్ తో పాటు రేషన్‌కార్డు జత చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా… ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలు, దరఖాస్తుదారు ఫొటో అతికించాలి.

మెుత్తం 4 పేజీల దరఖాస్తు ఫారం ఉంటుంది. తొలి పేజీలో కుటుంబ యజమాని పేరు, పుట్టిన తేదీ, ఆధార్‌ సంఖ్య, రేషన్‌కార్డు సంఖ్య, మొబైల్‌ ఫోన్‌ నంబరు, వృత్తితో పాటు సామాజికవర్గం వివరాలను నింపాలి.ఆ తర్వాత సామాజికవర్గ వివరాలతో పాటు కుటుంబసభ్యుల పేర్లు, వారి పుట్టిన తేదీలు, వారి ఆధార్‌ నంబర్లు రాయాలి. తర్వాత దరఖాస్తుదారు చిరునామా నింపాలి. కుటుంబ వివరాల తర్వాత పథకాలకు సంబంధించిన వివరాలున్నాయి. ఏ పథకానికి దరఖాస్తు చేయాలని అనుకుంటే ఆ పథకం దగ్గర టిక్‌ మార్కు చేయాలి. మరోవైపు ప్రజాపాలన దరఖాస్తులు గడువు పెంచే అవకాశం లేదు. ఆరో తేదీన ముగిస్తే…దరఖాస్తులను గ్రామాల్లో స్వీకరించే అవకాశం ఉండదు. స్థానిక ఎమ్మార్వో లేదా ఎంపీడీవో కార్యాలయాల్లో ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మళ్లీ నాలుగు నెలల్లో గ్రామాల్లో ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అప్పుడు మళ్లీ దరఖాస్తులను స్వీకరిస్తారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *