Pesara Punugulu: నూనె పీల్చుకోని.. క్రిస్పీ పెసరపప్పు పునుగులు..

 Pesara Punugulu: నూనె పీల్చుకోని.. క్రిస్పీ పెసరపప్పు పునుగులు..

ఉదయం అల్పాహారంలోకి పెసరపప్పుతో చేసే పునుగులు ప్రయత్నించి చూడండి. నూనెలో డీప్ ఫ్రై చేయాలని భయపడక్కర్లేదు. కొన్ని టిప్స్ పాటించి చేస్తే నూనె చాలా తక్కువగా పీల్చుకుంటాయి. ఈ పెసర పునుగుల్ని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో పక్కా కొలతలతో తెల్సుకోండి.

కావాల్సిన పదార్థాలు:

ఒకటిన్నర కప్పుల పొట్టు పెసరపప్పు

4 పచ్చిమిర్చి

అంగుళం అల్లం ముక్క

గుప్పెడు కొత్తిమీర తరుగు

తగినంత ఉప్పు

డీప్ ఫ్రై కి సరిపడా నూనె

తయారీ విధానం:

  1. ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడుక్కుని 1 నుంచి 2 గంటల పాటూ నానబెట్టుకోవాలి. ఎక్కువ సేపు నానబెడితే పునుగులు నూనె ఎక్కువగా పీల్చుకుంటాయని మర్చిపోవద్దు.
  2. మిక్సీ జార్‌లో పెసరపప్పు నీళ్లు లేకుండా వేసుకుని అల్లం ముక్క, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కొత్తిమీర తరుగు కొద్దిగా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి.
  3. పిండిని మరీ మెత్తగా కాకుండా బరకగా ఉండేలా చూసుకోవాలి. దాంతో పునుగులు క్రిస్పీగా వస్తాయి. పిండి పట్టేటప్పుడు నీళ్లు వేసుకోకుండానే పట్టడానికి ప్రయ్నత్నించాలి. అవసరమైతే రెండు మూడు చెంచాల నీళ్లు మాత్రమే వాడాలి.
  4. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని మళ్లీ కాస్త కొత్తిమీర, సన్నగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి.
  5. పిండి పలుచగా అనిపిస్తే ఒక చెంచా బియ్యం పిండి కలుపుకోవచ్చు. పిండి ఎక్కువగా కలిపితే పునుగులు కాస్త గట్టిగా వస్తాయని మర్చిపోవద్దు.
  6. ఇప్పుడు కడాయిలో నూనె పోసుకుని బాగా వేడెక్కాక మంట మీడియం మీద ఉంచి చిన్న చిన్నగా పునుగులు వేసుకోవాలి. బాగా రంగుమారాక టిష్యూ పేపర్ మీద తీసుకోవాలి.
  7. వేడివేడి పునుగుల్ని పల్లీ లేదా కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి.
Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *