Pawan Kalyan: రాజ్యసభకు నాగబాబు.. పవన్ సంచలన నిర్ణయం!
ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ పదవుల సందడి మొదలైంది.ముగ్గురు ఎంపీల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలకు తాజాగా ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబుకు రాజ్యసభ పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది
Pawan Kalyan: జనసేప పార్టీలో కీలక నేత, మెగా బ్రదర్ నాగబాబుకు పదవిపై ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది.. ఆయన ఢిల్లీకి వెళతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించిన ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటన విడుదలైంది. ఈ క్రమంలో ఆ మూడు ఎంపీ పదవులు ఎవరికి దక్కుతాయనే చర్చ జరుగుతుంది. ఈ మూడు సీట్ల కేటాయింపుపై చర్చలు నడుస్తున్నాయి.
టీడీపీ రెండు, జనసేన ఒక పదవి..
కూటమి పార్టీల పంపకాలపై ఫోకస్ పెట్టారు. అయితే ఈ మూడు పదవుల్లో నాగబాబుకు ఒక పదవి గ్యారంటీ అనే ప్రచారం జరుగుతోంది. రాజ్యసభలో జనసేన పార్టీకి ప్రాతినిధ్యం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ ఒక రాజ్యసభ పదవి కోరుతున్నట్లు టాక్ వినపడుతుంది. ఈ విషయం గురించి ఢిల్లీలో కేంద్ర పెద్దల దగ్గర కూడా ప్రస్తావించారనే మాటలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో నాగబాబుకు రాజ్యసభ పదవి ఇస్తారనే ప్రచారం జోరుగా చర్చ సాగుతుంది. మూడు పదవుల్ని కూటమిలోని మూడు పార్టీలు తలా ఒకటి తీసుకుంటాయా.. లేక టీడీపీ రెండు, జనసేన ఒక పదవి తీసుకుంటుందా అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
అంతేకాదు టీడీపీకి రెండు.. బీజేపీకి ఒక పదవి ఇస్తారనే మరో ప్రచారం కూడా నడుస్తుంది. టీడీపీ నుంచి కూడా ఎంపీ రేసులో పలువురు పేర్లు ఇప్పటికే తెర మీదకి వచ్చాయి. కంభంపాటి రామ్మోహన్‌రావు, బీదా మస్తాన్‌రావు, గల్లా జయదేవ్, సానా సతీష్ పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. అంతేకాదు నందమూరి సుహాసినికి అవకాశం ఇస్తారనే మరో ప్రచారం కూడా జరుగుతోంది.నాగబాబు జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి జనసేన పార్టీ తరఫున ఎంపీగా పోటీచేసి ఆయన ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పార్టీ బలోపేతం కోసం పనిచేశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. అక్కడ పర్యటించి పార్టీ నేతలతో సమావేశం కూడా అయ్యారు.. పోటీ చేయడం ఖాయమనే చర్చ కూడా నడిచింది. కానీ నాగబాబు ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. కూటమి పార్టీల మధ్య పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీగా బీజేపీ నుంచి సీఎం రమేష్ పోటీ చేయగా విజయం అందుకున్నారు. నాగబాబు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేశారు. అలాగే నాగబాబుకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం కూడా అప్పట్లో బాగా నడిచింది.
కానీ తాను రేసులో లేనని నాగబాబు చెప్పారు. ఇప్పుడు తాజాగా రాజ్యసభ పదవి తెర మీదకి వచ్చింది. మరి ఈ రాజ్యసభ పదవుల పంచాయతీ త్వరలోనే తేలిపోనుంది. కూటమి మూడు పార్టీలు దీనిపై చర్చించి త్వరలోనే ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు కనపడుతుంది. ఇప్పటి వరకు అధికారికంగా ఎవరి పేర్లు ప్రకటించలేదు.