Paddy Procurement : తేమ ఉన్నా, రంగు మారిన ధాన్యం కొనుగోలు చేస్తాం- మంత్రి కారుమూరి
Paddy Procurement : రంగు మారిన, తేమ ఉన్నా ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.
Paddy Procurement : మిచౌంగ్ తుపాను నేపథ్యంలో సీఎం జగన్ ఆదేశాలతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నిరకాల చర్యలు చేపట్టామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తేమ ఉన్నా, రంగు మారిన ధాన్యం అనే తేడా లేకుండా ఎక్కడికక్కడ కొనుగోలు చేస్తున్నామన్నారు. మిచౌంగ్ తుపాను బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని మంత్రి తెలిపారు. మంగళవారం తణుకు నియోజకవర్గంలోని దువ్వ, వరిగేడు గ్రామాల్లో పర్యటించిన మంత్రి కారుమూరి వరి చేలను పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ… ఎలాంటి పరిస్థితిలో ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని తెలిపారు. వీలైనంత త్వరగా రైతులు తమ ధాన్యాన్ని అందుబాటులో ఉన్న మిల్లులకు తరలించాలని సూచించారు. ఆఫ్లైన్, ఆన్లైన్ రెండు విధాలుగానూ ధాన్యాన్ని తరలించే అవకాశం కల్పించామని మంత్రి తెలిపారు. ఏ మిల్లర్లు అయినా రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
“రైతులకు అండగా నిలుస్తాం. రైతులకు నష్టం జరగకుండా సీఎం జగన్ అన్ని ఆదేశాలు ఇచ్చారు. నిన్నటి వరకు ఎక్కడికక్కడ ధాన్యా్న్ని కొనుగోలు చేశాం. ఆన్ లైన్ లో 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొలుగోలు చేశాం. 1.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఆఫ్ లైన్ లో కొనుగోలు చేశాం. ఇంకా 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని గోడౌన్లలో భద్రపరిచాం. ప్రతి గింజను రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తాం. రూ.11 వందల కోట్లు ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ఇప్పటికి రూ.800 కోట్లు రైతులకు చెల్లించాం. ఏ ఒక్క రైతు నష్టపోకుండా ధాన్యం కొనుగోలు చేసిన రెండ్రోజుల్లో డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నాం”-మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
48 గంటల్లో పరిహారం
మిచౌంగ్ తుపానుతో నష్టపోయిన బాధితులకి 48 గంటల్లోనే పరిహారం చెల్లించాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. సోమవారం నుంచి కలెక్టర్లు, అధికారులతో ఎప్పటికప్పుడు తుపాన్ పరిస్థితులపై సమీక్షిస్తూ.. సహాయక చర్యలపై దిశానిర్దేశం చేస్తున్నారు. మిచౌంగ్ తుపాను నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ప్రభుత్వం చేపట్టింది. జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగాన్ని ముందుగానే అప్రమత్తం చేసింది. ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్షలు నిర్వహిస్తూ తుపాను బాధిత ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యేలకు, సమన్వయకర్తలకు, ప్రజాప్రతినిధులకు వైసీపీ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు యుద్ధప్రాతిపదికన సహాయక కార్యక్రమాల్లో పాల్గొని బాధితులకి బాసటగా నిలవాలని కోరింది.