OU: అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లోకి ఆగంతకులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
సికింద్రాబాద్ ఓయూ పీజీ లేడీస్ హాస్టల్లోకి శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. విద్యార్థినులు వారిలో ఒకరిని పట్టుకొని హాస్టల్ గదిలో బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. నిందితుడుని పోలీసు స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేయగా.. విద్యార్థులు అడ్డుకున్నారు. తమకు రక్షణ కల్పించాలంటూ హాస్టల్లో నిరసనకు దిగారు. దీంతో హాస్టల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ప్రధానాంశాలు:
- అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లోకి ఆగంతకులు
- సికింద్రాబాద్ ఓయూ పీజీ లేడీస్ హాస్టల్లో ఘటన
- ఆందోళనకు దిగిన విద్యార్థినులు
అయితే ఆగంతకుడుని తీసుకెళ్లే క్రమంలో హాస్టల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అతడిని తరలిస్తున్న పోలీసు వాహనాన్ని విద్యా్ర్థులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమక రక్షణ లేదంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. విషయం పెద్దది కావటంతో పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడి ఏసీపీ స్థాయి అధికారి చేరుకున్నా.. విద్యార్థులు వినిపించుకోలేదు.
తమకు న్యాయం జరిగే వరకు ఆగతంకుడిని ఇక్కడి నుంచి తీసుకెళ్లేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. తాము గతంలో ఓయూ క్యాంపస్‌లో ఉండేవారని.. ఇటీవలే బేగంపేట పీజీ లేడీస్ హాస్టల్‌కు తరలించినట్లు చెప్పారు. ఇక్కడ సరైన వసతులు లేవని చెప్పినా.. ప్రిన్సిపాల్, రిజిస్ట్రార్ వినిపించుకోలేదని ఆరోపించారు. ఇంకా బిల్డింగ్లు కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయని.. రక్షణ గోడలు చిన్నవిగా ఉండటం, సీసీ కెమెరాలు లేకపోవటంతో తమ రక్షణ ప్రశ్నార్థకంగా మారిందని వాపోయారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తాము గతంలోనే హాస్టల్ వార్డెన్‌కు సూచించగా.. ‘ఏం జరిగిందని కెమెరాలు ఏర్పాటు చేయాలి’ అంటూ వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారన్నారు. ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు హాస్టల్లోకి వస్తున్నారని.. ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అంటూ విద్యార్థినులు నిలదీశారు. తమకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గబోమని.. తమ పవర్ ఏంటో చూపిస్తామని హెచ్చరించారు