Nitish reddy: బాక్సింగ్ టెస్ట్ హీరో.. నితీష్‌కి ACA భారీ నజరానా

ఆస్ట్రేలియా గడ్డపై అదరగొడుతున్న తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ భారీ నజరానా ప్రకటించింది. నితిష్‌కు ప్రోత్సాహంగా రూ.25 లక్షలు అందిస్తామని ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు.
Nitish kumar reddy:ఆస్ట్రేలియా గడ్డపై అదరగొడుతున్న తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిపై క్రీడాలోకం ప్రశంసలు కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ నితీష్ అద్భుత సెంచరీని ఆకాశానికెత్తేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి నారా లోకేష్ సైతం అభినందనలు తెలిపారు. విశాఖ కుర్రాడు ఆసీస్‌పై అద్భుత శతకం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఒత్తిడిలోనూ చక్కగా రాణించారని.. అతడి ధైర్యం, పట్టుదల, సంకల్ప శక్తిని చూసి గర్విస్తున్నానంటూ పోస్ట్ పెట్టారు.
రూ.25 లక్షల నగదు..
ఇక ఈ సందర్భంగా నితీష్ కుమార్ రెడ్డిపై ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ భారీ నజరానా ప్రకటించింది. నితీష్‌ను మరింతగా ప్రోత్సహించేందుకు రూ.25 లక్షలు నగదు అందిస్తామని ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఈ మేరకు నితీష్ గురించి కేశినేని చిన్ని మాట్లాడుతూ.. నేటి యువతకు నితీశ్ రోల్ మోడల్ అంటూ ప్రశంసించారు.
కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేయాలి.. సీఎం చంద్రబాబు
అలాగే సీఎం చంద్రబాబు సైతం నితీష్ పై ప్రశంసలు కురిపించారు. ‘బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో మెల్‌బోర్న్ గడ్డపై నితీష్ సెంచరీ కొట్టాడు. విశాఖపట్నం కుర్రాడు శతకం చేయడం అభినందనీయం. ఆసీస్ గడ్డపై అతిపిన్న వయసులో సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా ఘనత సాధించడం సంతోషం కలిగిస్తోంది. రంజీలోనూ ఆంధ్రా తరఫున ఎన్నో విజయాలు సాధించాడు. అండర్ -16 నుంచే అద్భుత ప్రదర్శన ఇస్తున్నాడు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని.. భారత జట్టులో కొనసాగి కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అంటూ సీఎం చంద్రబాబు అభినందించారు.