Narikelam: నారికేళం అంటే ఏమిటి? నారికేళంలో రకాలేమిటి?
Narikelam: ప్రత్యేక పూజల్లో తప్పకుండా కొబ్బరికాయ వాడతాం. అయితే అన్ని నారికేళాల్లో కెళ్లా కొన్ని రకాలకు ప్రత్యేక విశిష్టత ఉంటుంది. అవేంటో వివరంగా తెలుసుకోండి.
వేదాంతులు ఈ నారికేళాన్ని బ్రహ్మజ్ఞాన ప్రతీకగా భావిస్తారు. మానవులు ఆచరించే దైవ దేవ కర్మలన్నిటిలో కలశస్థాపనలో ఈ నారికేళం ప్రాముఖ్యత సంతరించుకుంది. మానవులు ఆచరించే వివిధ పూజల్లో ఎన్ని నైవేద్యములు సమర్చించినా నారికేళము లేనిదే ఆ నివేదన పరిపూర్ణత పొందరు. పూజ పూర్ణ ఫలాన్ని ఇవ్వదు. నారి – శక్తికి ప్రతీక, కే – కేశుడికి ప్రతీక, ళి – శివుని ప్రతీకగా పేరు కలిగిన అమృతతత్వం.
నారికేళం విశిష్టత:
సర్వదేవతలను పూజించే సమయాల్లో యజ్ఞ హోమాదుల్లో, శుభకార్యాల్లో కొబ్బరికాయ కొట్టడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఒకవిధంగా ఆలోచిస్తే కొబ్బరికాయపైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామిముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామనీ, లోపలనున్న తెల్లని కొబ్బరిలా మన మనసును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరినీరులా తమ జీవితాలను ఉంచమని అర్ధం అన్నమాట. ఈ సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయే కదా! కొబ్బరికాయ అంటే మానవ శరీరం, బోండంపై నున్న చర్మం మన చర్మం, పీచు మనలోని మాంసం పెంకే ఎముక, కొబ్బరే ధాతువు. అందులోని కొబ్బరినీరు మన ప్రాణాధారం. కాయపైనున్న మూడు కళ్ళు ఇడ, పింగళ, సుషుమ్న అనే నాడులు.
ఏకాక్షి నారికేళం:
ఏకాక్షీ నారికేళం అత్యంత విశిష్టమైనది. ఏకాక్షీ నారికేళం పూజించి, తమ తమ పూజామందిరాల్లో ఉంచుకుంటే వారికి త్రిమూర్తుల రక్షణ, సర్వవ్యవహార విజయం, సర్వ ఐశ్వర్యాల ధన ధాన్య సంతాన సౌభాగ్య సంపదలు సమకూరే అనుగ్రహాన్ని విఘ్నరాజు అనుగ్రహించినట్లు శాస్తవచనమును, ఏకాక్షీ నారికేళం వాసన చూసిన గర్భిణులకు సుఖప్రసవమవుతుంది. ఏకాక్షీ నారీకేళం ఉన్న ఇంట్లో భూతప్రేత పిశాచాల వంటి దుష్టశక్తులు ప్రవేశించవు. కోర్టు వాజ్యాలలో విజయం శత్రునాశనం, వశీకరణం వంటి ఫలితాలు పొందడానికి నారికేళ పూజ ప్రశస్తమైంది.
ఈ నారికేళ పూజ అక్షయ తృతీయనాడు దీపావళి అమావాస్య, గ్రహణం రోజున గ్రహణ సమయంలోను జరిపితే అద్భుత ఫలితాలనిస్తాయి. జీవాత్మ, పరమాత్మలకు ప్రతీకగా ద్వినేత్ర నారికేళం అపూర్వ దైవ ప్రసాదంగా చెప్పబడింది. ఇది గుండ్రటి ముఖాకృతి కలిగిన నారికేళం. పార్వతీ పరమేశ్వర స్వరూపంగా, లక్ష్మీనారాయణ స్వరూపంగాను శివకేశవ స్వరూపంగానూ భావిస్తూ భక్తులు పూజిస్తారని అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.