Nara Lokesh Deputy CM: లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాల్సిందే.. పవన్ కు మాజీ ఎమ్మెల్యే వర్మ బిగ్ షాక్

 Nara Lokesh Deputy CM: లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాల్సిందే.. పవన్ కు మాజీ ఎమ్మెల్యే వర్మ బిగ్ షాక్

నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ కు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మద్దతు పలికారు. కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తగా లోకేష్ ను డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. ఇది టీడీపీ కార్యకర్తల మనసులో మాట అని అన్నారు.

నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందేనని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. కోటి సభ్యత్వాలు చేసిన ఘనత లోకేష్ కే దక్కుతుందని కొనియాడారు. పార్టీ పూర్తిగా పోయిందని, టీడీపీకి భవిష్యత్తు లేదన్న వారందరికీ లోకేష్ యువగళంతో సమాధానం చెప్పారన్నారు. ఎవరి పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయన్నారు. దీనిపై కొన్ని సోషల్ మీడియా, మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం సరికాదన్నారు. లోకేష్ కష్టాన్ని గుర్తించాలని కేడర్ కోరుకోవడంలో తప్పేముందన్నారు.

ఓడిపోయి, భవిష్యత్తు ఏంటో కూడా తెలియని జగన్నే సీఎం..సీఎం అంటున్నారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను జనసేన కార్యకర్తలు సీఎం.. సీఎం అని పిలుస్తున్నారన్నారు. అలాంటిది పార్టీని బలోపేతం చేసి, కార్యకర్తలకు ధైర్యం నింపిన లోకేష్ ను డిప్యూటీ సీఎం అంటే తప్పేంటి? అని ప్రశ్నించారు. కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తగా లోకేష్ ను డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. ఇది కేవలం తన ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదని.. టీడీపీ కార్యకర్తల మనసులో మాట అని అన్నారు. ఏదేమైనా అధినేత తీసుకునే నిర్ణయమే కార్యకర్తలందరికీ శిరోధార్యమన్నారు.
ఇది కూడా చదవండి: పవన్ వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదు.. నారా లోకేష్ షాకింగ్ ప్రకటన!

పవన్ కోసం పోటీ నుంచి తప్పుకున్న వర్మ..

మాజీ ఎమ్మెల్యే వర్మ గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పిఠాపురం నుంచి పోటీ చేయడానికి సిద్ధం అయ్యారు. కానీ పవన్ అక్కడి నుంచి పోటీకి దిగాలని నిర్ణయించడంతో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. మొదట్లో కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినా.. ఆ తర్వాత పవన్ గెలుపే లక్ష్యంగా శ్రమించారు. జనసేన శ్రేణుల నుంచి సైతం ఆయనకు ప్రశంసలు దక్కాయి. అయితే.. గత కొన్ని రోజులుగా పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేనగా పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ నుంచి జనసేనలో చేరిన కొందరు ఇలాంటి పరిస్థితులు తీసుకువస్తున్నారని వర్మ గతంలో ఆరోపించారు. తాజాగా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని వర్మ డిమాండ్ చేయడంతో పిఠాపురంలో జనసేన, టీడీపీ నేతల మధ్య వివాదం మరింత పెరిగే అవకాశం ఉంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *