Miss World 2025: తారలు దిగి వచ్చిన వేళ

దివిలో ఉండే తారలంతా భువికి దిగి వస్తే! అందులోనూ హైదరాబాద్‌కు వస్తే శనివారం సాయంత్రం గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్-2025 పోటీల ప్రారంభ కార్యక్రమం సరిగ్గా అలాగే కనిపించింది.
- వైభవంగా మిస్ వరల్డ్ పోటీల ప్రారంభం.. పాల్గొన్న 110 దేశాల సుందరీమణులు
- భారత్ తరఫున నందినీ గుప్తా ప్రాతినిధ్యం.. వేడుకల్లో ఉట్టిపడిన తెలంగాణ సంస్కృతి
- ఆకట్టుకున్న పేరిణి నృత్యం.. ‘భారత్ మాతాకీ జై’ నినాదంతో మార్మోగిన ప్రాంగణం
- అత్యంత పటిష్ఠమైన భద్రత మధ్య పోటీలు.. ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మే 10 (ఆంధ్రజ్యోతి): దివిలో ఉండే తారలంతా భువికి దిగి వస్తే! అందులోనూ హైదరాబాద్‌కు వస్తే!! శనివారం సాయంత్రం గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్-2025 పోటీల ప్రారంభ కార్యక్రమం సరిగ్గా అలాగే కనిపించింది. 110 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటున్న ఈ పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దాదాపు రెండున్నర గంటలపాటు ఈ కార్యక్రమం జరిగింది. ఈ పోటీలతో.. ఉద్యమగడ్డ తెలంగాణపై ప్రపంచ దేశాలన్నీ సాక్షాత్కరించాయి. ఆయా దేశాల జెండాలతో వారంతా కలిసి ఒకేసారి ర్యాంపుపైకి రాగా.. భారత్ తరఫున మిస్ ఇండియా నందినీ గుప్తా జాతీయ జెండాతో అందరికీ అభివాదం చేశారు. ఆ ఘట్టం ఉద్విగ్నభరితంగా సాగింది. పాకిస్థాన్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. ప్రపంచ దేశాలు పాల్గొనే మిస్ వరల్డ్ పోటీల్లో భారతదేశ జెండా కనబడగానే ‘‘భారత్ మాతాకీ జై’’ అనే నినాదంతో స్టేడియం మార్మోగింది. తెలంగాణ గేయంతో ప్రారంభమైన 72వ మిస్ వరల్డ్ పోటీల ప్రారంభ కార్యక్రమం.. జాతీయగీతం జనగణమనతోపాటు అంతకుముందు మిస్‌వరల్డ్ గీతం ఆలాపనతో ముగిశాయి. మరోవైపు అందాలబామల ప్రదర్శన మధ్యలో తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలు, వాటి ఔన్నత్యం తదితర అంశాలతో కూడిన కొన్ని వీడియో సందేశాలను ప్రదర్శించారు.