Medchal Crime : అద్దె ఇంట్లో డ్రగ్స్ తయారీ, సోషల్ మీడియా ద్వారా విక్రయం-సూరారంలో ముఠా అరెస్ట్
Medchal Crime : సూరారంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని డ్రగ్స్ తయారు చేస్తు్న్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.50 లక్షల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
Medchal Crime : మేడ్చల్ జిల్లా సూరారంలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను నార్కోటిక్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ముఠా సభ్యుల నుంచి భారీగా మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నార్కోటిక్ ఎస్పీ చక్రవర్తి కేసుకు సంబంధించిన పూర్తి విషయాలను వెల్లడించారు.
రూ.50 లక్షలు విలువ చేసే మాదక ద్రవ్యాలు సీజ్
పట్టుబడ్డ ముగ్గురు సభ్యుల నుంచి 60 గ్రాముల క్రిస్టల్ మేథంపేటమైన్ ,700 ఎమ్మెల్ లిక్విడ్ మేథంపేటమైన్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ సుమారు రూ.50 లక్షల వరకు ఉంటుందని నార్కోటిక్ ఎస్పీ చక్రవర్తి పేర్కొన్నారు.ఈ ముఠాలోని ప్రధాన నిందితుడైన కమ్మ శ్రీనివాస్ నగరంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ గాజులరామారంలో నివాసం ఉంటున్నాడు. ముఠాలో మరో నిందితుడు కాకినాడకు చెందిన మణికంఠ చెరువులో చేపల పెంపకం చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటున్నాడు. ఇక మరో నిందితుడు నరసింహ రాజు సూపర్ వైజర్ కం డ్రైవర్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా కమ్మ శ్రీనివాస్ 2013లో ఓ పరిశ్రమలో పని చేస్తున్నప్పుడు డ్రగ్స్ తయారీ రసాయనం క్రిస్టల్ మేథంపేటమైన్ ను తయారు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
సూరారంలో ఇల్లు అద్దెకు తీసుకుని
నాలుగేళ్ల కిందట కమ్మ శ్రీనివాస్ ఇదే డ్రగ్స్ తయారీ విషయంలో జైలుకు కూడా వెళ్లొచ్చారని పోలీసులు వెల్లడించారు. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత నరసింహ రాజు, మణికంఠలతో కలిసి డ్రగ్స్ తయారు చేయడం మొదలు పెట్టాడు. అందుకోసం సూరారంలో ఓ ఇల్లును అద్దెకి తీసుకొని, డ్రగ్స్ తయారు చేసి వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ ముగ్గురి ముఠా డ్రగ్స్ విక్రయిస్తున్నారు. అయితే కొందరి స్థానికుల ఫిర్యాదుల మేరకు నార్కోటిక్ పోలీసులు దాడి చేసి ఈ డ్రగ్స్ ముఠాను అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.