Kota Srinivasa Rao Awards: అవార్డుల ‘కోట’, అభినయ సామ్రాట్!

 Kota Srinivasa Rao Awards: అవార్డుల ‘కోట’, అభినయ సామ్రాట్!

పద్మశ్రీ కోట శ్రీనివాసరావు తెలుగు సినిమాకు చేసిన సేవలకుగాను 2015లో భారత ప్రభుత్వం నుండి “పద్మశ్రీ” అందుకున్నారు. ఆయన తొమ్మిది నంది అవార్డులు (ఉత్తమ విలన్, సహాయ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ విభాగాల్లో) గెలుచుకున్నారు. మరెన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు.

తెలుగు సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయన సినీ కెరీర్ చూస్తే ఎన్నో అద్భుతాలు.కోట శ్రీనివాసరావు తన నటనకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఆయన అందుకున్న ముఖ్యమైన అవార్డులు గురించి తెలుసుకుందాం.

తొలిసారిగా 1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన కోట శ్రీనివాసరావు, అనతి కాలంలోనే తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి, తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేశారు. కేవలం విలన్‌గా, హాస్యనటుడిగానే కాకుండా, సహాయ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా వందల సినిమాల్లో నటించి మెప్పించారు. తండ్రి, బాబాయ్, పెద్దమనిషి, రాజకీయ నాయకుడు, పిసినిగొట్టు, ఆదరించే తాతయ్య వంటి ఎన్నో విభిన్న పాత్రల్లో ఇట్టే ఒదిగిపోయారు. ఆయా పాత్రలకు జీవం పోసి ఆయన ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.

అవార్డుల ‘కోట’

పద్మశ్రీ పురస్కారం

భారతీయ సినిమాకు కోట శ్రీనివాసరావు చేసిన విశేష సేవలకు గుర్తింపుగా.. 2015లో భారత ప్రభుత్వం ఆయనకు దేశంలోని నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మశ్రీ’ ప్రదానం చేసింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఇది ఆయన సినీ ప్రస్థానంలో ఒక గొప్ప మైలురాయి. దాదాపు 37 సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నటుడిగా కొనసాగుతున్నందుకు గాను ఈ గౌరవం లభించింది.

తొమ్మిది నంది అవార్డులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్టాత్మకమైన నంది అవార్డులను కోట శ్రీనివాసరావు ఏకంగా తొమ్మిది సార్లు అందుకున్నారు. ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ నటుడు వంటి వివిధ విభాగాల్లో ఆయన నటనకు ఈ పురస్కారాలు లభించాయి. ఆయన అందుకున్న కొన్ని ముఖ్యమైన నంది అవార్డులు ఇప్పుడు తెలుసుకుందాం.

1985లో స్పెషల్ జ్యూరీ అవార్డు: ‘ప్రతిఘటన’ చిత్రంలోని (కాశయ్య పాత్రకు)

1998లో ఉత్తమ విలన్: ‘గణేష్’ చిత్రానికి

2000లో ఉత్తమ విలన్: ‘చిన్న’ చిత్రానికి

2002లో ఉత్తమ సహాయ నటుడు: ‘పృథ్వీ నారాయణ’ చిత్రానికి

2004లో ఉత్తమ సహాయ నటుడు: ‘ఆ నలుగురు’ చిత్రానికి (ఈ సినిమాలో ఆయన నటనకు విశేష ప్రశంసలు దక్కాయి)

2006లో ఉత్తమ సహాయ నటుడు: ‘పెళ్లైన కొత్తలో’ చిత్రానికి

SIIMA అవార్డు:

2012లో విడుదలైన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్రంలో ఆయన నటనకు గానూ SIIMA (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) పురస్కారం లభించింది.

ఇతర పురస్కారాలు:

పద్మశ్రీ, నంది, సైమా అవార్డులతో పాటు, కోట శ్రీనివాసరావు తన కెరీర్‌లో అనేక ఇతర పురస్కారాలు, సన్మానాలు అందుకున్నారు. అక్కినేని సెంటినరీ ఫిలిం అవార్డులలో జీవన సాఫల్య పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఇది ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానానికి, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించినందుకు లభించిన గుర్తింపు. కోట శ్రీనివాసరావు, తన అసాధారణమైన అభినయంతో తెలుగు సినిమాకు చేసిన సేవలు అపారమైనవి. ఆయన అందుకున్న పురస్కారాలు ఆయన ప్రతిభకు, నిబద్ధతకు నిదర్శనం.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *