Khairathabad Ganesh: ఖైరతాబాద్ గణేశుడిని చూడడానికి వెళ్లి.. క్యూలైన్లో మహిళ ప్రసవం!
వినాయక చవితి పర్వదినం సందర్భంగా.. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి వచ్చిన రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళ క్యూలైన్‌లోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
Khairathabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ ఉత్సవం హైదరాబాద్(Hyderabad)లోని అత్యంత ప్రసిద్ధ పండుగలలో ఒకటి. ఇది ప్రతి సంవత్సరం వినాయక చవితి(Vinayaka Chaviti) సందర్భంగా జరుపుకుంటారు. ఇక్కడి గణపతి విగ్రహం దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఈ విగ్రహం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తోంది. భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి, ఆశీర్వాదం పొందేందుకు దేశ నలుమూలల నుంచి తరలివస్తారు. పది రోజులపాటు జరిగే ఈ పండుగలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఉత్సవం ఖైరతాబాద్ ప్రాంతంలో భక్తి, ఉత్సాహాన్ని నింపుతుంది. అయితే ఖైరతాబాద్ గణపతి దర్శనానికి వచ్చిన భక్తురాలికి క్యూలైన్లోనే ప్రసవం అయింది. వినాయక చవితి పర్వదినం సందర్భంగా.. ఆ మహాగణపతిని దర్శించుకోవడానికి వచ్చిన రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళ క్యూలైన్‌లోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం ఉదయం నుంచి విశ్వశాంతి మహాశక్తి గణపతిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దర్శనం కోసం క్యూలో నిలబడిన రాజస్థాన్‌కు చెందిన రేష్మాకు ప్రసవ నొప్పులు రావడంతో.. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందించి సురక్షితంగా ప్రసవం జరిగేలా చూశారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవం 1954లో స్వాతంత్ర్య సమరయోధుడు సింగరి పంతులు ప్రారంభించారు. ఇతను భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందినవారు. మొట్టమొదటి విగ్రహం కేవలం ఒక అడుగు ఎత్తు మాత్రమే ఉండేది. కానీ కాలక్రమేణా విగ్రహం ఎత్తు ప్రతి సంవత్సరం పెరిగింది. ఈ విగ్రహం వినాయక చవితి ఉత్సవాల చివరి రోజున.. అంటే అనంత చతుర్దశి రోజున హుస్సేన్ సాగర్ సరస్సులో నిమజ్జనం చేస్తారు. 2022లో వినాయకుడి నిమజ్జనం మొదటిసారిగా క్రేన్‌లను ఉపయోగించి నిమజ్జనం చేసారు. ఈ ఉత్సవానికి హైదరాబాద్‌లోని నలుమూలల నుంచి మాత్రమే కాకుండా.. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఈ ఉత్సవాలు మత సామరస్యానికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయి. ఇక్కడ వినాయకుడు భక్తుల కోరికలను నెరవేర్చుతాడని నమ్ముతారు.