KCR: గులాబీ జెండా.. తెలంగాణకు అండాదండా..! బీఆర్ఎస్ రజతోత్సవ జాతరపై స్పెషల్ స్టోరీ..

ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారత చరిత్రలో వేల రాజకీయ పార్టీలు ఉనికిలోకి వచ్చాయి. అందులో అనేకం మఖలో పుట్టి పుబ్బలో మాయమయ్యాయి. కొన్ని మాత్రమే సుదీర్ఘకాలం ప్రజాక్షేత్రంలో మనగలిగినయి. రాష్ట్ర సాధన కోసమే ఒక రాజకీయపార్టీని స్థాపించి..పద్నాలుగేండ్లు ప్రజా ఉద్యమాన్ని ముందుండి నడిపి.. తన ప్రాణాలే పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించి.. స్వరాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన అనితర సాధ్యమైన చరిత్ర కేసీఆర్ సొంతం! ఆయన మానసపుత్రిక తెలంగాణ రాష్ట్ర సమితి..ప్రస్తుత BRS.. 25 ఏళ్ల పండుగ జరుపుకొంటోన్న వేళ ప్రత్యేక కథనం..
ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారత చరిత్రలో వేల రాజకీయ పార్టీలు ఉనికిలోకి వచ్చాయి. అందులో అనేకం మఖలో పుట్టి పుబ్బలో మాయమయ్యాయి. కొన్ని మాత్రమే సుదీర్ఘకాలం ప్రజాక్షేత్రంలో మనగలిగినయి. రాష్ట్ర సాధన కోసమే ఒక రాజకీయపార్టీని స్థాపించి..పద్నాలుగేండ్లు ప్రజా ఉద్యమాన్ని ముందుండి నడిపి.. తన ప్రాణాలే పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించి.. స్వరాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన అనితర సాధ్యమైన చరిత్ర కేసీఆర్ సొంతం! ఆయన మానసపుత్రిక తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రస్తుత BRS.. 25 ఏళ్ల పండుగ జరుపుకొంటోంది. ఎల్కతుర్తి వేదికగా జరిగే చరిత్రాత్మక రజతోత్సవ సభలో.. గులాబీ దళపతి కేసీఆర్ చేసే మహాగర్జన కోసం.. యావత్ తెలంగాణ సమాజంతోబాటు దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
కోట్ల మంది ఆవేశాన్ని దాచుకున్న ఒకే ఒక గుండె అది..! ఆటుపోట్లకు ఎదురు నిలిచిన తెగువ KCR సొంతం!! ఎంత సహనం.. ఎంత నమ్మకం.. ఎంత రాజసం..! తెలంగాణ తల్లికి రూపాన్ని..బంగారు తెలంగాణకు స్వరూపాన్ని ఇచ్చిన ధీరోదాత్తుడు కేసీఆర్!!
ఆనాటి జలదృశ్యం నుంచి నేటి జన దృశ్యం వరకు.. అస్తిత్వ పోరాటం నుంచి.. అధికార పీఠం వరకు.. అధికార పీఠం నుంచి..ప్రజా హృదయ సింహాసనం వరకు దాకా..కేసీఆర్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ పార్టీ చరిత్ర గతినే మార్చివేసింది. త్యాగాల పునాదుల మీద బీఆర్‌ఎస్ ఆవిర్భవించింది. తెలంగాణ సాధనే ధ్యేయంగా..కేసీఆర్ ఎత్తిన ఆ గులాబీ జెండా..25 ఏళ్లుగా తెలంగాణ ప్రజలకు అండాదండగా.. జయకేతనమై రెపరెపలాడుతోంది.
ఉద్యమ పార్టీ నుంచి పక్కా పొలిటికల్ పార్టీగా మారి.. తెలంగాణను అభివృద్ధికి చిరునామాగా మార్చింది.. ఇంకా చెప్పాలంటే.. తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా.. చెక్కుచెదరని అభిమానాన్ని సాధించి.. బీఆర్‌ఎస్ చిరకీర్తిని సొంతం చేసుకుంది.
తెలంగాణ ప్రజలు తమను తాము పరిపాలించుకోవాలనే ఆకాంక్షకు రాజకీయ వ్యక్తీకరణగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. వలస వాదం సుడిగాలిలో తెలంగాణ అస్తిత్వ స్పృహను కాపాడుకుంటూ.. విజయ పతాకం ఎగురవేసింది టీఆర్‌ఎస్! 1969 ఉద్యమం అణగారిపోయిన తరువాత.. ఎప్పటికైనా తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించగల మరో నాయకుడు వస్తాడా? అన్న ముక్కోటి ఆశల ప్రతిరూపంగా.. కేసీఆర్ గులాబీ జెండా ఎగురవేశారు. తెలంగాణను విముక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో ఎందరో త్యాగధనులున్నారు. కానీ ఉద్యమమే కేసీఆర్‌ను ఎంచుకుంది. రెండు దశాబ్దాలుగా తెలంగాణను ఊగించి, ఉరికించి, దీవించి, శాసించి.. విజయతీరాలకు చేర్చిన నాయకుడు కేసిఆర్! అవును.. కేసిఆర్ ఉన్నత వ్యక్తిత్వం ముందు, ఆయన ఉక్కు సంకల్పం ముందు విధి సైతం తలవంచింది. ఆయన వ్యూహ చతురత వల్ల.. సిద్దాంతాలకు, పార్టీలకు అతీతంగా నాయకగణం తెలంగాణకు జై కొట్టింది. కేసీఆర్ అచంచల దీక్ష, సిద్దాంత బలం, వాగ్ధాటికి ముగ్ధులై..జాతీయ స్థాయిలో అనేక పార్టీలు తెలంగాణకు మద్దతు పలికాయి. ఫలితంగా తెలంగాణా ఆవిర్భవించింది.
వెనుకబడిన తెలంగాణ వేదనలోంచి గులాబీ జెండా ఎగసింది. కేసీఆర్ నేతృత్వంలో ముందుకు ఉరికింది. సుశిక్షితులైన కార్యకర్తలే పునాదిగా పురోగమించింది. ధనబలం ఉన్న పార్టీలను జనబలంతో ఢీకొట్టింది. ఉద్యమ పార్టీగా భూకంపం పుట్టించింది. మఘలో పుట్టి పుబ్బలో పోతుందని అవహేళన చేసిన పార్టీలను అదృశ్యం చేసింది. స్వరాష్ట్ర స్వప్నం సాకారం చేసింది. స్వరాష్ట్రంలో సకల జనుల ఆకాంక్షలకు ప్రతిరూపంగా తెలంగాణ పీఠం అందుకుంది. వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చి..తనదైన శైలిలో సుపరిపాలన అందించింది. ప్రస్తుతం విపక్ష పార్టీగానూ అవిశ్రాంతంగా ప్రజా గళం వినిపిస్తోంది.
కేసీఆర్ స్థాపించింది ఒక రాజకీయపార్టీని మాత్రమే కాదు. అది మూడున్నర కోట్ల మంది ప్రజలను ఒక్కతాటి మీదికి తీసుకొచ్చిన మహోద్యమం! ఒక మనిషి తన జీవితకాలంలో కోట్లాది ప్రజలను ప్రభావితం చేసిన మహాద్భుత సన్నివేశం! డిప్యూటి స్పీకర్ పదవి మొదలుకొని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, కేంద్ర మంత్రి వంటి పదవులను ప్రజల ఆకాంక్ష కోసం తృణప్రాయంగా వదిలిన ఘన చరిత్ర బీఆర్‌ఎస్ సొంతం! ఆ త్యాగమే పార్టీని ప్రజలకు దగ్గర చేసింది. రాజీనామా చేసి వచ్చిన ప్రతిసారీ రెట్టింపు మెజారిటీతో ప్రజానీకం గెలిపించింది. భావజాల ప్రచారం దగ్గర్నుంచి.. ఉద్యమ కార్యాచరణ వరకు..రాజకీయ సమరం నుంచి..ప్రజా సమస్యలపై పోరాటాల వరకు.. 25 ఏళ్లుగా బీఆర్‌ఎస్‌ను కేసీఆర్ నడిపిన తీరు అద్భుతం..అనితర సాధ్యం!
టీఆర్ఎస్ ప్రస్థానం ప్రారంభమైన రోజున దేశంలో అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకం! పద్నాలుగు ఏండ్ల పోరాటం తర్వాత.. దాదాపు అన్ని పార్టీలు అనుకూలం! వ్యవస్థలైనా, రాజకీయ పార్టీలైనా.. తెలంగాణకు అనుకూలంగా మారవలసిన అనివార్యతను సృష్టించడం కేసీఆర్ వ్యూహ చతురతకు నిదర్శనం. ఉద్యమం తొలినాళ్ల నుంచి మొదలుపెట్టి.. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేవరకూ ప్రతి దశలో అత్యంత నేర్పుతో, వ్యూహ చతురతతో తెలంగాణను విజయ తీరాలకు చేర్చారు కేసీఆర్!! గుప్పెడు మందితో ప్రారంభమైన పార్టీ..ఇప్పుడు ఉప్పెనగా మారిన తీరు..అనితర సాధ్యం! ఈ ప్రయత్నంలో ఆయనకు ఆచార్య జయశంకర్ గారు తోడుగా నిలిచారు. తెలంగాణ ఏర్పాటును వాయిదా వేస్తూ పోయిన కాంగ్రెస్ పార్టీ వైఖరి ఒకవైపు.. ఉద్యమాన్ని దెబ్బతీయాలనే కుయుక్తులు ఇంకోవైపు.. ఈ రెంటినీ మట్టి కరిపించి.. గులాబీ పార్టీ కాలపరీక్షకు నిలిచి గెలిచింది.
కేసీఆర్ ఏం చెప్పారో అదే చేశారు. రక్తపాతం లేకుండా..రాజకీయంగానే తెలంగాణ తెస్తామన్నారు. తెచ్చారు. తిట్టిన నోళ్లె పొగిడే స్థాయిలో, ఆకాశమంత ఎత్తుకు పార్టీని పెంచారు. ఇందుకోసం ఆయన కఠోర క్రమశిక్షణ పాటించారు. అందరికీ అది అలవాటు చేశారు. అధ్యయనశీలత అంటే ఏమిటో.. రాజకీయ నాయకునికి అది ఎంత అవసరమో ఆయన నిరూపించారు.
అంతేకాదు, బీఆర్‌ఎస్ పార్టీని ప్రజలతో మమేకం చేయడంలో కేసిఆర్ కొత్త ఒరవడిని నెలకొల్పారు. ఆయన మేధావులలో మేధావి, కవుల మధ్య కవి, కళాకారులతో ఉంటే కళాకారుడు. పత్రికా సంపాదకులకు పాత్రికేయులకు ఉద్యోగులకు కార్మికులకు కర్షకులకు అందరికీ పార్టీతో ఉద్యమ సంబంధం కేసీఆర్ వల్లే సాధ్యమైంది. బిందువుగా ప్రారంభమైన పార్టీ నేడు సింధువుగా మారింది. రజతోత్సవ సంబురాలు జరుపుకొంటోంది.
గులాబీ జెండా ఒక పార్టీ జెండాగా కాకుండా తెలంగాణా జెండాగా మారిందంటే దానికి కారణం కేసీఆర్ మర్గదర్శకత్వమే! గులాబీ పార్టీ 25 ఏళ్ల పండుగ వేళ..తెలంగాణ సమాజం రజతోత్సవ జాతర చేసుకుంటోంది. గులాబీ దళపతి కేసీఆర్ రాక కోసం..పలకరింపు కోసం..ఉత్తేజపూరిత ప్రసంగం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. రెండున్నర దశాబ్దాల ఘన చరిత్రను సగర్వంగా స్మరించుకుంటూ, ఈ 25 ఏళ్ల పండుగ వేళ ప్రతి కార్యకర్త గుండె నిండా గులాబీ పూస్తోంది. త్యాగాల పునాదులపై ఏర్పడ్డ బీఆర్‌ఎస్..బంగారు తెలంగాణ బాట నిండా గులాబీలు పరుస్తోంది. రజతోత్సవ వేదికగా.. కేసీఆర్ సారథ్యంలో మరో విజయ ప్రస్థానానికి సిద్ధమవుతోంది. జై తెలంగాణ!!