Journalist VV Krishnam Raju: సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్.. నేడు కోర్టులో హాజరు!

Senior journalist VV Krishnam Raju Arrest: సీనియర్ జర్నలిస్ట్, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు బుధవారం (జూన్ 11) రాత్రి గుంటూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏపీ రాజధాని అమరావతి విషయంలో మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యానించారనే అభియోగాలతో..

ఇక ఈ వ్యవహారంలో ఇప్పటికే సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలోని ఆయన నివాసంలో జూన్ 9వ తేదీన విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మంగళగిరి కోర్టు కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్ విధించడంతో గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలతో జర్నలిస్టులు వీవీఆర్ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఖంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
గుంటూరు జిల్లాలోని తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత, సమాచార సాంకేతిక చట్టం, షెడ్యూల్డ్ కులాలు అండ్ షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నివారణ) చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌లో సెక్షన్లు 79, 196(1), 353(2), 299, 356(2), 61(1)BNS, 67 ITA-2008, 3(1)(U), SC/ST (అత్యాచారాల నివారణ) చట్టం కింద కేసులు నమోదైనాయి.