Instant Idli Batter: పప్పు రుబ్బకుండానే ఇలా ఇన్‌స్టెంట్ ఇడ్లీలు తయారు చేసేయండి
Instant Idli Batter: ఇడ్లీలు వండాలంటే ముందుగానే పప్పును, బియ్యాన్ని నానబెట్టుకుని మరుసటి రోజు రుబ్బుకోవాలి. ఇలా కాకుండా సింపుల్‌గా కూడా ఇడ్లీ చేసుకోవచ్చు.
Instant Idli Batter: ప్రతి ఇంట్లోనూ ఇడ్లీ ఉండాల్సిందే. ఎక్కువ మందికి ఇష్టమైన ఫలహారం ఇడ్లీ. దీన్ని తయారు చేయాలంటే ముందు రోజు రాత్రి పప్పు నానబెట్టుకొని, మరుసటి రోజు రుబ్బుకోవాలి. కొన్ని గంటలపాటు పిండిని పులియనివ్వాలి. అప్పుడే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఇది చేయడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. ఇలా కాకుండా అప్పటికప్పుడు ఇడ్లీని తయారు చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు మెత్తటి ఇడ్లీలను వండుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.
ఇన్‌స్టాంట్ ఇడ్లీ ఇలా చేయండి
అప్పటికప్పుడు ఇడ్లీ చేసుకోవడానికి ముందుగా ఇడ్లీ పొడిని రెడీ చేసుకోవాలి. మినప్పప్పు లేదా అటుకులు ఇందుకు ఉపయోగపడతాయి. అటుకులను ముందుగా పొడిలా చేసి ఒక డబ్బాలో దాచుకోవాలి. అలాగే ఇడ్లీ రవ్వను కూడా తీసి పెట్టుకోవాలి.
ఇప్పుడు మినప్పప్పును తీసుకొని స్టవ్ పై రెండు నిమిషాలు వేయించాలి. ఆ మినప్పప్పులోనే కొన్ని మెంతులు కూడా వేసి వేయించాలి. అవి చల్లారిపోయిన తర్వాత మిల్లు దగ్గర పొడి చేసుకుని రావాలి. ఆ పిండిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇడ్లీ చేసుకోవడానికి ముందు ఒక గిన్నెలో ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ, అర గ్లాసు మినప పిండి, అర గ్లాసు అటుకుల పొడి వేసి కలపాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పుని వేయాలి.
అందులో పుల్లటి పెరుగును కూడా వేసి కలిపితే ఇడ్లీలు రుచిగా వస్తాయి. పిండి పులిస్తేనే ఇడ్లీ రుచిగా ఉంటుంది. పిండి పులియలేదు కాబట్టి పులిసిన పెరుగును వేయాలి. ఈ మిశ్రమాన్ని పది నిమిషాలు అలా వదిలేసి తర్వాత ఇడ్లీ స్టాండ్‌లో ఇడ్లీల్లా వేసుకోవాలి. ఆవిరి మీద ఉడికిస్తే మెత్తటి ఇడ్లీలు రెడీ అయిపోతాయి. కొంతమంది దీనిలో వంటసోడా కూడా వేసుకుంటారు. పులిసిన పెరుగు వేసాం కాబట్టి ఈ ఇడ్లీలు మెత్తగానే వస్తాయి. ఇంకా మెత్తగా కావాలనుకుంటే కాస్త వంట సోడా వేసుకోవచ్.చు ఇడ్లీలను ఎప్పటికప్పుడే వండుకోవచ్చు, కాబట్టి ముందు రోజే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు.