Independence Day 2025: స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవానికి మధ్య తేడా ఇదే!
భారతదేశ చరిత్రలో ఆగస్టు 15, జనవరి 26 తేదీలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రెండు తేదీల్లో జాతీయ పండుగలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. అయితే, చాలామందికి ఈ రెండు పండుగలకు ఉన్న తేడాపై స్పష్టమైన అవగాహన ఉండదు. స్వాతంత్ర్య దినోత్సవం అంటే ఏమిటి? గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి? ఈ రెండింటిలో ఏది గొప్ప పండుగ అనే చర్చలు తరచుగా వినిపిస్తాయి. ఇప్పుడు ఈ రెండు జాతీయ పండుగలకు మధ్య ఉన్న ప్రధాన తేడాలను తెలుసుకుందాం..
స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15)
ఆగస్టు 15, 1947న భారతదేశం బ్రిటిష్ వారి పాలన నుండి స్వాతంత్ర్యం పొందింది. ఆ రోజు నుండి భారతదేశం ఒక స్వతంత్ర దేశంగా అవతరించింది. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ రోజున ప్రధానమంత్రి ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ వేడుక భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరుల త్యాగాలను గుర్తు చేస్తుంది. దీనిని జాతీయ గౌరవానికి, స్వాతంత్ర్యానికి చిహ్నంగా భావిస్తారు.