IND vs AUS 3rd ODI: ఆసీస్‌తో భారత్ మూడో వన్డే.. గెలిస్తే చరిత్రే
IND vs AUS 3rd ODI: భారత్, ఆస్ట్రేలియా మధ్య బుధవారం (సెప్టెంబర్ 27) మూడో వన్డే జరగనుంది. సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ ఖరారు చేసుకుంది టీమిండియా. అయితే, ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ ఓ చరిత్ర సృష్టించనుంది.
IND vs AUS 3rd ODI: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో ఆఖరి పోరుకు భారత్ సిద్ధమైంది. రాజ్‌కోట్‌లో బుధవారం (సెప్టెంబర్ 27) ఈ మూడో వన్డే జరగనుంది. ఇప్పటికే ఈ మూడు వన్డేల సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లను టీమిండియా గెలిచింది. దీంతో 2-0 ఆధిక్యంలోకి వెళ్లి ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ఖాయం చేసుకుంది. బుధవారం మూడో వన్డేలో టీమిండియా, ఆసీస్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్‌ను వైట్‌వాష్ చేయాలని భారత్ పట్టుదలగా ఉంది. ఆసీస్‌పై ఈ మూడో వన్డేలో విజయం సాధిస్తే టీమిండియా కొత్త చరిత్ర సృష్టించనుంది. వివరాలివే..
ఈ సిరీస్ తర్వాత అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రపంచకప్ ఉండటంతో ఆస్ట్రేలియాతో తొలి రెండు మ్యాచ్‌లకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకున్నారు. దీంతో కేఎల్ రాహుల్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, ఈ మూడో వన్డేకు రోహిత్, కోహ్లీ, కుల్దీప్ తిరిగి జట్టులోకి వచ్చేశారు. అయితే, శుభ్‌మన్ గిల్, మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా, షార్దూల్ ఠాకూర్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేరు. వ్యక్తిగత కారణాలతో వారు మూడో వన్డేకు దూరమయ్యారు.
గెలిస్తే చరిత్రే
ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ఈ మ్యాచ్ గెలిస్తే 3-0తో ఈ సిరీస్‌ను టీమిండియా వైట్‌వాష్ చేస్తుంది. చరిత్రలో ఇప్పటి వరకు ఆసీస్‌ను వన్డే సిరీస్(కనీసం 3 మ్యాచ్‌లు)లో భారత్ వైట్‌వాష్ చేయలేదు. అందుకే, ఒకవేళ మూడో మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను తొలిసారి వైట్‌వాష్ చేసిన చరిత్రను సృష్టించినట్టవుతుంది.
టైమింగ్స్, లైవ్
భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే బుధవారం (సెప్టెంబర్ 27) మధ్యాహ్నం 1.30 గంటలకు మొదలవుతుంది. అంతకంటే అర గంట ముందు టాస్ పడుతుంది. స్పోర్ట్స్ 18 టీవీ ఛానెల్లో ఈ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. జియో సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ యాప్, వెబ్సైట్లో ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.
తుది జట్లు ఇలా..!
భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా
ఆస్ట్రేలియా తుదిజట్టు (అంచనా): మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ కేరీ, గ్లెన్ మ్యాక్స్ వెల్, మార్కస్ స్టొయినిస్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ఆడమ్ జంపా, జోస్ హాజిల్‌వుడ్
ఈ సిరీస్ వైట్‌వాష్ చేస్తే.. భారత్ వేదికగానే అక్టోబర్ 5 నుంచి జరిగే వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియాకు మరింత ఆత్మవిశ్వాసం దక్కుతుంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో మ్యాచ్‌తోనే వరల్డ్ కప్ వేటను భారత్ మొదలుపెట్టనుంది.