Hyderabad News : ఫీజు చెల్లించలేదని పరీక్షకు అనుమతించని యాజమాన్యం, నిజాం కాలేజీ విద్యార్థులు ఆందోళన
Hyderabad News : హైదరాబాద్ లో నిజాం కాలేజీ విద్యార్థులు ఆందోళన దిగారు. సెమిస్టర్ ఫీజు చెల్లించలేదని కొందరు విద్యార్థులను పరీక్ష రాయకుండా యాజమాన్యం అడ్డుకుంది. ముందుగా సమాచారం ఇవ్వకుండా ఉన్నఫలంగా ఫీజు కట్టమంటున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
Hyderabad News : హైదరాబాద్ నిజాం కాలేజీ విద్యార్థులు సోమవారం మరోసారి రోడ్డెక్కారు. సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు చెల్లించలేదనే సాకుతో పలువురు విద్యార్థులను పరీక్ష రాయనీయకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఫీజు చెల్లింపు విషయంలో గతంలోనూ ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని, అప్పుడు కూడా ఫీజు కట్టించుకున్న తరువాతే విద్యార్థులకు యాజమాన్యం పరీక్షలకు అనుమతినిచ్చిందని పలువురు విద్యార్థులు చెబుతున్నారు.
రోడ్డెక్కిన నిజాం కాలేజీ విద్యార్థులు
అయితే ఈసారి తామంతా ఫీజు కట్టేందుకు సిద్ధంగా ఉన్న కాలేజీ యాజమాన్యం ఉద్దేశపూర్వంగానే తమను పరీక్షకు అనుమతించడం లేదంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కాగా సెమిస్టర్ ఫీజు చెల్లించాలని పరీక్షలకు 10 రోజుల ముందు ఒక నోటీస్ ఇస్తే తాము ఫీజును సిద్ధం చేసుకునే వాళ్లమని కొందరు చెబుతున్నారు. ఉన్న ఫలంగా ఫీజు కట్టాలని లేదంటే పరీక్షకు అనుమతి లేదని చెప్పడం ఎంత వరకు సమంజసమని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
విద్యార్థులంతా ఏకమై
ఇదిలా ఉంటే ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఫీజు చెల్లించిన పలువురు విద్యార్థులు మద్దతు తెలుపుతూ వారు కూడా పరీక్షను బహిష్కరించారు. అయితే కాలేజీలో మొత్తం 15 మంది విద్యార్థులు సెమిస్టర్ ఫీజు కట్టనందున వారికి పరీక్ష నిర్వహించేందుకు యాజమాన్యం తిరస్కరించింది. దీంతో మిగిలిన విద్యార్థులు కూడా ఈ 15 మందికి మద్దతుగా నిలిచారు. తమతో పాటు ఫీజు కట్టని 15 విద్యార్థులకు కూడా ఎగ్జామ్ పెడితేనే తాము రాస్తామని అల్టిమేటం జారీ చేశారు. దీంతో నిజాం కాలేజీ రోడ్డు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న కాలేజీ యాజమాన్యం ,అబిడ్స్ పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు, కాలేజీ యాజమాన్యం ఆందోళన చేస్తున్న విద్యార్థులకు నచ్చ జెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.