Hyderabad: మీరు ఐస్ క్రీమ్ ఎక్కువగా తింటారా..అయితే 3 లక్షలు మీ సొంతం!

హైదరాబాద్‌లో ఈ నెల 27న ‘ది గ్రేట్ ఇండియన్ ఐస్‌క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్’ జరగనుంది. కళ్లకు గంతలు కట్టుకుని ఫ్లేవర్‌ను గుర్తిస్తే రూ. 3 లక్షల వరకు బహుమతులు గెలుచుకోవచ్చు. ఎర్రమంజిల్‌లోని ప్రీమియా మాల్‌లో ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకు పోటీలు జరుగుతాయి.
ఐస్‌క్రీమ్ ప్రియులకు ఒక ప్రత్యేకమైన పోటీ వేదిక రాబోతుంది. కళ్లకు గంతలు కట్టుకుని వివిధ రకాల ఐస్‌క్రీమ్ ఫ్లేవర్‌లను గుర్తిస్తే చాలు.. ఏకంగా రూ. 3 లక్షల వరకు నగదు బహుమతులు గెలుచుకునే అవకాశం మీ కోసం రెడీ అవుతుంది. ది గ్రేట్ ఇండియన్ ఐస్‌క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ మూడవ ఎడిషన్ ఈ నెల 27న ఐస్‌క్రీమ్ అభిమానుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.
ఈ ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఎర్రమంజిల్‌లోని గలేరియా మాల్‌లో ప్రముఖ హీరోయిన్ కావ్య కల్యాణ్‌రామ్, బిగ్‌బాస్ ఫేమ్ శ్వేతావర్మ, నటుడు సమీర్‌లు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు పోటీ పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ ఆసక్తికరమైన పోటీలో విజేతలకు భారీ నగదు బహుమతులు అందజేయనున్నారు.
మొదటి బహుమతిగా రూ. లక్ష, రెండవ బహుమతిగా రూ. 50 వేలు, మూడవ బహుమతిగా రూ. 25 వేలు గెలుచుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా.. మరో 25 మంది విజేతలను ఎంపిక చేసి, ఒక్కొ విజేతకు రూ. 5 వేల చొప్పున కన్సోలేషన్ బహుమతులు కూడా నిర్వాహకులు ఇవ్వనున్నారు.
ఈ పోటీలు ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ పక్కన ఉన్న ప్రీమియా మాల్‌లో ఈ నెల 27న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ తారలు స్వయంగా కళ్లకు గంతలు కట్టుకుని వివిధ ఐస్‌క్రీమ్ ఫ్లేవర్‌లను గుర్తించే ప్రయత్నం చేశారు.. ఇది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ ఛాలెంజ్‌లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు మరింత సమాచారం కోసం 8008574747 నెంబర్‌లో సంప్రదించవచ్చని నిర్వాహకులు సూచించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఐస్‌బర్గ్ ఐస్‌క్రీమ్స్ సీఈఓ సుహాస్ బి. శెట్టి, ఒక ప్రముఖ తెలుగు ఛానెల్ ఎండీ ఎం. రాజ్‌గోపాల్ , డాక్టర్ జె. సంధ్యారాణి వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పోటీ కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా.. ఐస్‌క్రీమ్ రుచులను గుర్తించడంలో మీ నైపుణ్యాన్ని పరీక్షించే ఒక ప్రత్యేకమైన వేదికగా కూడా నిలవనుంది